Haleem: హలీం తింటారా? ఎంత డబ్బు జేబులో పెట్టుకుని వెళ్లాలో తెలుసా?
మటన్ రేట్లు అధికంగా ఉండడంతో హలీం రేట్లు కూడా ఎలా ఉన్నాయంటే?

రంజాన్ మాసం మరో వారం రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో, అప్పుడే హలీం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రంజాన్ అనగానే ప్రజలు అందరికీ హలీం కూడా గుర్తుకువస్తుంది. రంజాన్ మాసంలో హలీం రుచిని చూడకుండా ఉండలేరు చాలా మంది.
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాసం ముగించిన తర్వాత ఇఫ్తార్ సమయంలో ఎక్కువగా తినే వంటకం ఇది. హైదరాబాద్ హలీం ఎంతగా ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే, ఈ సారి హలీం ధరలు భారీగా పెరిగాయి.
మటన్ రేట్లు అధికంగా ఉండడంతో హలీం రేట్లను కూడా పెంచారు తయారీదారులు. గత ఏడాది దాదాపు రూ.280కు ప్లేట్ హలీం వచ్చేది. ప్రస్తుతం హలీం ప్లేట్ రూ.300 చొప్పున అమ్ముతుఉన్నారు. ఇటీవల నాంపల్లి ఎగ్జిబిషన్ ముగిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ పిస్తా హౌస్ హలీంను ప్లేట్‌కు రూ.300 చొప్పున అమ్మింది.
ఇప్పుడు ఎగ్జిబిషన్ ముగిసినప్పటికీ హైదరాబాద్‌లో హోటళ్ల వద్ద ప్లేట్ రూ.300కు అమ్ముతున్నారు. అయినప్పటికీ హలీం మీద ఇష్టంతో జనాలు భారీగానే కొంటున్నారు.
వచ్చేనెల 1న గగనంలో నెల వంక కనిపిస్తే ఆ తర్వాతి రోజు నుంచి రంజాన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇఫ్తార్ విందులో కూడా హాలీంను పెడతారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో అమ్మే హలీం అంటే చాలా మందికి ఇష్టం. వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ హలీం తిని వెళ్తుంటారు.