HCU భూముల వివాదం ఇప్పట్లో ఆగదా? భారీ కుంభకోణం ఉందన్న కేటీఆర్.. ఏం జరగనుంది?

భూ పంచాయితీపై మంత్రివర్గ కమిటీ ఏం చెబుతుంది? హైకమాండ్‌‌కు మీనాక్షీ నటరాజన్‌ ఇచ్చే రిపోర్ట్‌ ఏంటి? కేటీఆర్‌ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు?

HCU భూముల వివాదం ఇప్పట్లో ఆగదా? భారీ కుంభకోణం ఉందన్న కేటీఆర్.. ఏం జరగనుంది?

HCU Land Issue

Updated On : April 9, 2025 / 8:50 PM IST

ఓ వైపు మీనాక్షీ నటరాజన్ నివేదిక.. మరోవైపు మంత్రుల కమిటీ సంప్రదింపులు.. ఇంకోవైపు భూ కుంభకోణం అంటున్న కేటీఆర్.. ఇటు బీజేపీ ఎంపీల సమావేశాలు.. ఇంతకీ HCU భూముల విషయంలో ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఎవరి యాక్షన్ వారిదే.. ఎవరి గోల వారిదే.. మరి ఎవరి రిపోర్ట్‌తో ఏం తేలబోతోంది?

రేవంత్ సర్కార్‌ నివేదిక రెడీ చేసేపనిలో ఉండగా.. కాంగ్రెస్ హైకమాండ్‌ ఎంటర్ కావాల్సిన అవసరమేంటనే డౌట్‌.. అన్ని లెక్కలు తేల్చుతాం.. అందరి తిక్కలు తీర్చుతామనే కేటీఆర్‌ సినిమా డైలాగ్స్.. రోజుకో ట్విస్ట్‌తో.. పూటకో టర్న్‌ తీసుకుంటుంది కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ రచ్చనే రాజేస్తోంది. ఈ ఒక్క అంశం తెలంగాణ పాలిటిక్స్‌లో హీటు పుట్టించింది. రోజుకో ట్విస్ట్‌, పూటకో మలుపు తిరుగుతూ ఉత్కంఠను క్రియేట్ చేస్తోంది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. ఈ నెల 16లోపు సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించింది కోర్టు.

దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. HCU విద్యార్థులతో పాటు అన్ని వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. HCUకు ఈ 400 ఎకరాల భూములతో ఎలాంటి సంబంధం లేదని, అది ప్రభుత్వ భూమి అని, పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా అభివృద్ధి చేపడతామని చెప్పే ప్రయత్నం చేస్తోన్న రేవంత్ సర్కార్ ఆ మేరకు రిపోర్ట్‌ కూడా రెడీ చేస్తోందని సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం తొందరపడిందా?
ఇదిలా ఉంటే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా తొందరపడిందా అనే డైలామాలో ఉందట కాంగ్రెస్ హైకమాండ్. అసలు ఆ భూముల గొడవేంటనేది తెలుసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్‌ను రంగంలోకి దింపింది. వెంటనే యాక్షన్‌లోకి దిగిన మీనాక్షి సచివాలయంలో రెండు సార్లు మంత్రుల కమిటీతో సమావేశమయ్యారు.

HCU విద్యార్ధులు, ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు, విద్యార్థి సంఘాలతో పాటు వివిధ వర్గాలతో వరుసగా భేటీ అవుతున్నారు. HCU భూముల చరిత్రపై క్షుణ్ణంగా ఆరాతీస్తున్న మీనాక్షీ నటరాజన్.. భూముల ఓనర్‌షిప్ ఎవరిది? నెక్ట్స్ తీసుకోవాల్సిన చర్యలేంటి? అనేది లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

ఇదే ఇప్పుడు రేవంత్ సర్కార్‌ను కలవరానికి గురిచేస్తోందని పొలిటికల్ సర్కిళ్లల్లో గాసిప్స్ మొదలయ్యాయి. HCU భూముల విషయంలో ప్రభుత్వం సరిగ్గా డీల్ చేయలేకపోయిందనే కాంగ్రెస్ అధిష్టానం మీనాక్షీని రంగంలోకి దింపిందనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె HCU అంశంపై అందరితో సంప్రదింపులు జరిపి ఓ నివేదిక రెడీ చేస్తున్నారట. దీంతో ఇప్పుడు మీనాక్షీ ఢిల్లీ పెద్దలకు ఎలాంటి నివేదిక ఇస్తుందోనన్న టెన్షన్‌ ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోందని తెలుస్తోంది.

ఇలా HCU భూముల విషయంలో ప్రభుత్వంతో పాటు మీనాక్షీ నటరాజన్ నివేదికలు రూపొందిస్తున్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తానో బాంబ్ పేల్చబోతున్నట్లు చెప్పారు. HCU భూముల వెనుక భారీ కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.

అందులో ఎవరెవరు ఉన్నారని ఆరా?
ఈ భూకుంభకోణం వెనుక కాంగ్రెస్ పెద్దలతో పాటు ఓ బీజేపీ ఎంపీ సైతం ఉన్నారనే కేటీఆర్ స్టేట్‌మెంట్ తెలంగాణ పాలిటిక్స్‌లో వైరల్‌గా మారింది. ఒకటి రెండు రోజుల్లో HCU భూకుంభకోణాన్ని పక్కా అధారాలతో బయటపెడతానని కేటీఆర్ ప్రకటించనప్పటి నుంచి ఈ భూముల వ్యవహారంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. HCU భూముల వ్యవహారంలో ఏం కుంభకోణం జరిగింది. అందులో ఎవరెవరు ఉన్నారని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరా తీయడం మొదలుపెట్టారట.

ఇటు బీజేపీ కూడా హెచ్‌సీయూ అంశంపై ఫోకస్ పెట్టింది. బీజేపీ ఎంపీలంతా కలిసి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో హెచ్‌సీయూ వీసీతో సమావేశమయ్యారు. అసలు హెచ్‌సీయూ భూముల అంశంపై యూనివర్సిటీ వర్షెన్ ఏంటనేది ఆరా తీశారు. ఈ సమావేశంతో బీజేపీ కూడా హెచ్‌సీయూ అంశంపై పోరుకు సిద్ధమయ్యేలా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన నేతలను పోలీసులు విచారించారు. మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్‌ను గచ్చిబౌలి పోలీసులు విచారణకు పిలిచి విచారణ జరిపారు.

ఇలా ఎవరికి వారు కంచ గచ్చిబౌలి చుట్టూ యాక్షన్ మొదలుపెట్టడంతో ఏం జరగబోతోందన్న ఆసక్తి రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనంలోనూ నెలకొంది. భూ పంచాయితీపై మంత్రివర్గ కమిటీ ఏం చెబుతుంది? హైకమాండ్‌‌కు మీనాక్షీ నటరాజన్‌ ఇచ్చే రిపోర్ట్‌ ఏంటి? కేటీఆర్‌ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు? బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఒన్ ఇష్యూ.. మెనీ కొశ్చన్స్.. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై హెడ్‌లైన్స్‌గా నిలిచాయి.