హైడ్రా దూకుడు.. రాంనగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైడ్రా దూకుడు.. రాంనగర్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Hydra Demolitions : ఇప్పటివరకు చెరువుల్లోనే కూల్చివేతలు చేపట్టిన హైడ్రా.. ఇప్పుడు కాలనీలపైనా ఫోకస్ పెట్టింది. కాలనీల్లో రోడ్లు, నాలాల ఆక్రమణపై ఉక్కుపాదం మోపింది. తాజాగా హైదరాబాద్ అడిక్ మెట్ డివిజన్ రాంనగర్ లో కూల్చివేతలకు దిగింది హైడ్రా. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో రోడ్లు, నాలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధారించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు ప్రారంభించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించిన గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చివేతలు ప్రారంభించడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం..
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిసున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, నాలాల రక్షణతో పాటు ఎక్కడైనా రోడ్లు, చిన్న చిన్న నాలాలు కబ్జాకు గురైతే వాటిపై ఫోకస్ చేస్తున్నారు. రాంనగర్ లో రోడ్డు, నాలాను మూసి వేసి నిర్మించిన కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 అంతస్తులపైనే ఉన్న నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, హైడ్రా అధికారులు సంయుక్తంగా నిర్మాణాన్ని నేలమట్టం చేశారు.

చుట్టూ భవనాలు ఉండటంతో మ్యానువల్ గానే కూల్చివేత పనులు..
రోడ్డును పూర్తిగా బంద్ చేసి భవనం నిర్మించారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. చుట్టూ భవనాలు ఉండటంతో అక్రమ కట్టడాన్ని భారీ యంత్రాలతో కూల్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో మ్యానువల్ గానే కూల్చివేత ప్రారంభించారు అధికారులు. సైడ్ లో ఉన్న గోడలను కూల్చాక కిందకు పడేలా స్లాబ్ ను మెల్ల మెల్లగా కూలుస్తున్నారు. మ్యానువల్ గా పనులు చేస్తుండటంతో.. భవనం మొత్తం నేలమట్టం చేసేందుకు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ప్రధాన రోడ్డును బంద్ చేసి భారీ అక్రమ నిర్మాణం..
రాంనగర్ నుంచి వీఎస్టీ వెళ్లే ప్రధానమైన రోడ్డును పూర్తిగా బంద్ చేసి ఇంత భారీ అక్రమ నిర్మాణం జరిగినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్థానికులు పలు మార్లు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు హైడ్రా ను అప్రోచ్ కావడంతో అక్రమ నిర్మాణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read : అటు ఫిర్యాదుల వెల్లువ, ఇటు రాజకీయ ఒత్తిళ్లు.. ఏం చేయాలో తెలియని అయోమయంలో హైడ్రా..!

ప్రధానంగా జీహెచ్ఎంసీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ల పర్యవేక్షణ.. చెరువులు, నాలాలు కబ్జా అయితే ఇరిగేషన్ అధికారుల నుంచి కూడా పూర్తి వివరాలు తీసుకుంటున్నారు హైడ్రా అధికారులు. టౌన్ ప్లానింగ్ నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు.