Hyderabad Weather : నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్.. వడగళ్ల వాన, పిడుగులు పడేందుకు అవకాశం..
Hyderabad Weather : భాగ్యనగరంలో ఒక్కసారిగా వాతావరణం ఉన్నట్లుండి మారిపోయింది. అప్పటి వరకు భగభగ మండిన భానుడు.. క్షణాల్లోనే కారు మబ్బుల చాటున దాక్కున్నాడు.
imd officials alert Sudden Weather Change in Hyderabad Rain Likely in Nearby Districts
- హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
- రానున్న 2,3 గంటల్లో పలు ప్రాంతాల్లో వర్షం
- శుక్రవారం మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
Hyderabad Weather : తెలంగాణ మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు భానుడి భగభగలతో విపరీతమైన ఎండతో విలవిల్లాడిన నగరాన్ని, నిమిషాల్లోనే కారుమబ్బులు కమ్మేశాయి. జోరుగా వర్షం కురిసే సూచనలు కనిపించాయి. ఈ అకస్మాత్తు వాతవరణ మార్పులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే రెండు మూడు గంటల్లో హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో వడగళ్ల వాన కురిసేందుకు అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 23 గురువారం సాయంత్రం వేళ కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరించారు. దీనివల్ల పంటలు, వాహనాలు మరియు తాత్కాలిక నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని.. బహిరంగ ప్రదేశాలు, చెట్లు మరియు విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని మరియు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సేవలు (Emergency services) సిద్ధంగా ఉన్నాయి.
అలానే ఏప్రిల్ 24, శుక్రవారం రోజున నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అంతేకాక రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
