Gold Hallmark: ఏపీ, తెలంగాణలో బంగారు నగలకు హాల్‌మార్క్ వర్తించే జిల్లాల సంఖ్య పెంపు.. అసలు హాల్‌మార్క్ అంటే ఏమిటి?
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నగలపై బీఐఎస్ మార్క్ ను చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. బంగారం స్వచ్ఛతను బట్టి 14, 18, 22 క్యారెట్లలో హోల్ మార్కింగ్ జరుగుతుంది.

Gold Hallmarks
Indian Gold Hallmarks: బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లు మోసపోకుండా ఉండేందుకు, వారి ప్రయోజనాలు కాపాడేందుకు హాల్‌మార్క్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛమైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 15 నుంచి బంగారు నగలకు హాల్‌మార్క్ నిబంధనను తప్పనిసరి చేసింది. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలు మాత్రమే ఈ నిబంధన పరిధిలో ఉండేవి. తాజాగా ఈ జాబితాలో కేంద్ర ప్రభుత్వం.. మేడ్చల్ – మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలను చేర్చింది. దీంతో తెలంగాణలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి 12 జిల్లాలు వచ్చి చేరాయి.
Gold Hallmarking : బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి.. ఈ నియమాలు పాటించాల్సిందే!
ఏపీలో 17 జిల్లాలకు వర్తింపు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు హాల్‌మార్క్ నిబంధనల పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉండేవి. ప్రస్తుతం.. అన్నమయ్య జిల్లా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలను ఈ జాబితాలో చేర్చుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో హాల్‌మార్క్ నిబంధనల పరిధిలోకి వచ్చిన జిల్లాల సంఖ్య 17కు చేరింది.
బంగారంపై హాల్‌మార్కింగ్ అంటే ఏమిటి..?
బంగారంపై హాల్ మార్కింగ్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్ (BIS) నాణ్యత ప్రమాణ పత్రం. ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. వినియోగదారులకు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలనే విక్రయించాలని ప్రభుత్వం నిబంధనలను తీసుకొచ్చింది. దీనికితోడు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో గోల్డ్ హాల్‌మార్కింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలను కేంద్రం ప్రవేశపెట్టింది. నగల దుకాణాల్లో విక్రయించే గోల్డ్ జువెలరీపై యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. దీన్నే హోల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అంటారు.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు నగలపై బీఐఎస్ మార్క్ ను చూడాలి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. బంగారం స్వచ్ఛతను బట్టి 14, 18, 22 క్యారెట్లలో హోల్ మార్కింగ్ జరుగుతుంది. హాల్‌మార్క్ 22కే.. 91.60శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. ఒకవేళ నగల వ్యాపారి చెప్పిన దానికంటే స్వచ్ఛత తక్కువ ఉందని తేలితే.. ఆ వ్యాపారి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా హాల్ మార్కింగ్ ఫీజు తిరిగి చెల్లించాలి.