Indiramma Sarees : మహిళలకు ఇందిరమ్మ చీరలు.. నేటి నుంచే పంపిణీ.. తొలి దశలో వారికి మాత్రమే.. పూర్తి వివరాలు ఇవే..
Indiramma Sarees : ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Indiramma sarees
Indiramma Sarees : ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తొలి విడత గ్రామీణ ప్రాంతాల్లో, రెండో విడత పట్టణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
నేటి నుంచి డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండో దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చీరల పంపిణీ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీకి సెర్ప్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, చీరల పంపిణీపై ఇవాళ మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
Also Read: Gold Price down : కుప్ప కూలుతున్న బంగారం.. 7000 తగ్గింది పో.. ఇంకొన్నాళ్లలో..!
రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రతీయేటా చీరలు పంపిణీ చేస్తామని గతేడాది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా చీరల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.322 కోట్లతో సిరిసిల్లలో చీరల తయారీ ప్రారంభమైంది. ఇప్పటికే 55లక్షల చీరలు తయారు కాగా.. మరో ఐదు లక్షలు సిద్ధమవుతున్నాయని అధికారులు తెలిపారు.
చీరల పంపిణీ కార్యక్రమంపై మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులకే కాకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల్లో చేరేలా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. చీరల నాణ్యత విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
