న్యాయం చేయాలి- కందుల జాహ్నవి కేసులో కేటీఆర్ డిమాండ్

భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి.

న్యాయం చేయాలి- కందుల జాహ్నవి కేసులో కేటీఆర్ డిమాండ్

KTR On Jaahnavi Kandula Case

Updated On : February 22, 2024 / 6:32 PM IST

Jaahnavi Kandula Case : అమెరికాలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి(ఏపీ) మృతి కేసులో కింగ్ కౌంటీ విచారణ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సాక్ష్యాధారాలు లేని కారణంగా జాహ్నవి మృతికి కారణమైన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ పై ఎలాంటి నేరాభియోగాలు మోపడం లేదని ప్రకటించింది. సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారికి శిక్ష పడే అవకాశాలు లేకుండా పోయాయి.

ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ నిర్ణయంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకుని జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేవనడం సరికాదన్న ఆయన.. ఈ విషయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెంటనే జోక్యం చేసుకోని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా చూడాలని కోరారు.

గత ఏడాది జనవరిలో సియాటెల్ లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని.. జాహ్నవి మృతి చెందింది. ప్రమాదానికి అతివేగమే కారణం అని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 40 మైళ్ల వేగంతో వెళ్లాల్సిన దారిలో 100 మైళ్ల వేగంతో వెళ్లడంతో పాటు ఎమర్జెన్సీ హారన్ ఇవ్వలేదని గుర్తించారు. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న జాహ్నవిని పోలీసు వాహనం బలంగా ఢీకొట్టడంతో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది.

”అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ది చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం బాధాకరం. ఈ అంశంలో భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి. అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం. జాహ్నవికి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం” అని కేటీఆర్ వాపోయారు.

Also Read : నీటి పోరు యాత్ర.. మరో ఉద్యమానికి సిద్ధమైన బీఆర్‌ఎస్‌!