తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి.. గాల్లోకి కాల్పులు
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు

Teenmar Mallanna
Teenmar Mallanna office: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాగృతి కార్యకర్తలు మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు.
అప్రమత్తమైన మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు.
కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిపై మల్లన్న స్పందించారు. తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని అన్నారు.
అయితే, తీన్మార్ మల్లన్న గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో పలువురి జాగృతి కార్యకర్తలకు గాయాలైనట్లు తెలిసింది. వారిని రాంనగర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.