తెలంగాణలో 24 గంటలు షట్‌డౌన్ : కేసీఆర్

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ జరుగబోతోంది. ఎవరికివారూ స్వచ్చంధంగా రోజుంతా తమ ఇంటికే పరిమితం కావాలని సూచిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకులు సైతం మూసివేస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేస్తున్నారు. తెలంగాణలో మెట్రో సర్వీసులను కూడా నిలివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేసే ఆలోచనలో ఉంది రాష్ట్ర్ర ప్రభుత్వం.
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా తీవ్రత, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారితోనే ఈ సమస్యంతా వస్తోందన్నారు. 20వేలకు పైగా విదేశాల నుంచి వచ్చారని చెప్పారు. 11వేల మందిని గుర్తించి ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పారు. జాయింట్ టీమ్ వల్ల మంచి ఫలితాలొస్తున్నాయని తెలిపారు.
ఇప్పటివరకూ 21 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. ఆ 21 మంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినవారేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో 52 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారు ప్రభుత్వానికి సహకరించాలని చెప్పారు. స్వచ్ఛందంగా స్థానిక వైద్యులను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. విదేశాల నుంచి వచ్చేవారికి నిరంతరం పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. దండం పెట్టి చెబుతున్నా.. విదేశాల నుంచి వచ్చేవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. విదేశాల నుంచి వచ్చే వాళ్లు మా బిడ్డలే.. ప్రభుత్వానికి వాలంటరీగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆదివారం ఉదయం 6 నుంచి అమల్లోకి :
వైరస్ లక్షణాలుంటే ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు. వైరస్ లేకుంటే మందులిచ్చి పంపించి వేస్తామని, ఎవరిని ఇబ్బంది పెట్టమని చెప్పారు. జలులు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. రేపు (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి తెలంగాణ జనతా కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు.
తెలంగాణలో ఆర్టీసీ బస్సులను కూడా బంద్ చేస్తున్నట్టు చెప్పారు. కేవలం డిపోకు 5 బస్సులు స్టాండ్ బైగా ఉంచుతామన్నారు. వర్తక, వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను రాష్ట్రంలోకి రానివ్వమని అన్నారు. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేస్తామన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాలు, పండ్లు, కూరగాయల షాపులు, పెట్రోల్ బంకులు తెరుచుకోవచ్చునని కేసీఆర్ చెప్పారు.
See Also | Janata Curfew : హైదరాబాద్ మెట్రో బంద్..ఆర్టీసీ బస్సులు కూడా ?