Jithender Reddy: కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకోలేదంటే నమ్మేదెవరు?: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి
Jithender Reddy: భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డిపై జితేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Jithender Reddy
Jithender Reddy: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఇచ్చారనే విషయం బహిరంగ రహస్యమేనని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jithender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలే ఈ విషయంపై చర్చించుకుంటున్నారని చెప్పారు.
కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి (Revanth Reddy) డబ్బులు తీసుకోలేదంటే నమ్మేదెవరని నిలదీశారు. అయినా ఉన్నమాటంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉలుకెందుకు? అని ప్రశ్నించారు. “ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాట్లాడటం హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీలో డబ్బులిచ్చి పదవులు కొనుక్కోవడం, డబ్బులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది.
ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జికి రూ.50 కోట్లు ముట్టజెప్పారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా ఆరోపించారు. అట్లాంటి రేవంత్ రెడ్డి తాను కేసీఆర్ నుంచి డబ్బులు తీసుకోలేదంటే నమ్మేదెవరు? మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ నుండి కాంగ్రెస్ పార్టీ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చెప్పారే తప్ప ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు.
ఆ సొమ్మును నేరుగా కాంగ్రెస్ నేతలు మునుగోడు ఉప ఎన్నికలో ఖర్చు చేశారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అయినప్పటికీ గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం హాస్యాస్పదం. భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు పోయి ప్రమాణం చేయడం పెద్ద డ్రామా” అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.
Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు