Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు

Revanth Reddy: "నా కళ్లలో నీళ్లు తెప్పించావు" అని రేవంత్ రెడ్డి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్ రాలేదు.

Revanth Reddy: భాగ్యలక్ష్మి అమ్మవారిపై రేవంత్ రెడ్డి ప్రమాణం.. ఈటలపై భావోద్వేగభరిత వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. బీఆర్ఎస్ నుంచి నిధులు తీసుకున్నానన్న ఆరోపణలను రేవంత్ రెడ్డి ఖండించారు.

“భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ఆత్మసాక్షిగా ప్రమాణం చేశాను. నేను హిందువును. దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. మునుగోడులో కాంగ్రెస్ అమ్ముడుపోయిందని ఈటల ఆరోపించారు. కేసీఆర్ నుంచి రూ.25 కోట్లు తీసుకుందని అన్నారు. కేసీఆర్ తో లాలూచీ నా రక్తంలోనే లేదు. కేసీఆర్ తో కొట్లాడుతున్న నాపై నిందలు ఎందుకు వేస్తున్నారు?

తుది శ్వాస వరకు కేసీఆర్ తో రాజీపడే ప్రసక్తే లేదు. చర్లపల్లి జైల్లో కేసీఆర్ నన్ను నిర్బంధించినా భయపడలేదు. కేసీఆర్ సర్వం దారబోసినా నన్ను కొనలేరు. ప్రశ్నించే గొంతుపై నిందలు వేస్తే కేసీఆర్ కు మద్దతు ఇచ్చినట్లే. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడదామంటే ఇదేనా ఈటల రాజేందర్? కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై నేనే పోరాటం చేశాను. నా కళ్లలో నీళ్లు తెప్పించావు” అని రేవంత్ రెడ్డి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? అని నిలదీశారు. వందల కేసులు పెట్టినా భయపడ లేదని అన్నారు. “మునుగోడు ఉప ఎన్నికలో పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా నిర్ణయించాం. ఒక్క రూపాయి పంచకపోయినప్పటికీ పాల్వాయి స్రవంతిని 25 వేల ఓట్లు వచ్చాయి. కేసీఆర్ తో కుమ్మక్కయ్యే అవసరం మాకు లేదు. మునుగోలులో బీజేపీ, బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. మునుగోడులో రూ.300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణలోని మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను 24 గంటల్లో నిరూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి రావాలని, అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని రేవంత్ అన్నారు.

తాము బీఆర్ఎస్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈటల అక్కడకు చేరుకోలేదు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అమ్మవారి ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు.

కాగా, గతంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇలాగే, తమ ప్రత్యర్థులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. ఇప్పుడు అదే గుడిలో రేవంత్ రెడ్డి అదే రీతిలో ప్రమాణం చేయడం గమనార్హం.

Revanth Challenged Etala : చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు రావాలని రేవంత్ సవాల్.. సవాళ్లపై స్పందించ వద్దని ఈటల నిర్ణయం