అప్పుడే మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి.. కాంగ్రెస్‌ నుంచి టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారని తెలుస్తోంది.

అప్పుడే మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి.. కాంగ్రెస్‌ నుంచి టికెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు

Updated On : June 13, 2025 / 9:32 PM IST

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుంది. ఆరు నెలల్లో బైపోల్ రావాల్సి ఉన్నా..రెండు మూడు నెలల్లోపే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఇప్పటి నుంచే మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్ సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.

ముఖ్యంగా కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా.. వరసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీకి, పార్టీ కంటే మిన్నగా, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉన్న అనుబంధం దృష్ట్యా..నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెపుతున్నారు.

మాగంటి కుటుంబం నుంచి ఎవరినైనా బరిలోకి దించుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. వారి కుటుంబం నుంచి పోటీకి ఎవరూ సుముఖంగా లేకపోతే..మరో నేతను పోటీలో పెట్టనున్నారు. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి బీఆర్ఎస్‌ టికెట్ ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు దాదాపు కన్ఫామ్ చేశారని అంటున్నారు. ఇక గతంలో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రావుల శ్రీధర్‌రెడ్డి ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. ఆయన కూడా టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

టికెట్లు ఆశిస్తున్నది వీరే?
ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో టికెట్‌ ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా మారుతోందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ఆయనతో పాటు చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్‌ యాదవ్‌ కూడా ఈసారిలో బరిలో నిలవాలని ప్లాన్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో నవీన్‌ యాదవ్‌కు మంచి పట్టుంది. 2014 ఎన్నికలలో నవీన్ యాదవ్‌మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. 2018లో AIMIMకు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు.

ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు పడ్డాయి. ఇక పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రెడ్డి, ఇంకోవైపు బీసీ, మరోవైపు మైనార్టీ ఈక్వేషన్‌లో హస్తం పార్టీకి ఎవరికి టికెట్ కేటాయిస్తుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం, మైనార్టీ ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్స్‌గా ఉన్నాయి. ఈనేపథ్యంలో ఎంఐఎం సపోర్ట్ ఎవరికన్నది కూడా చర్చనీయాంశం అవుతోంది.

Also Read: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. ప్రధాని మోదీకి నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్.. భారత్ రియాక్షన్ ఇదే!

ఇక బీజేపీ విషయానికి వస్తే..ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణాలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రొడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితులతో 2016లో బీఆర్ఎస్‌లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయ సాధించారు. అయినా..టీడీపీతో, ముఖ్యంగా చంద్రబాబుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి.

అందుకే.. మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్‌పై చర్చించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల వారుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పార్టీల వ్యూహాలు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.