TSPSC Group-1 : గ్రూప్-1 ఫలితాలు వచ్చేశాయ్.. ఆ ఒక్క పోస్టు మినహా.. టాప్-10 ర్యాంకర్లు వీరే.. టాపర్‌గా హైదరాబాద్ యువతి
Telangana Group 1 Final Result : గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించింది.

Telangana Group 1 Final Result
Telangana Group 1 Final Result : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది.
మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఒక పోస్టును న్యాయవివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు.
హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమైంది. ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించింది. అర్ధరాత్రి వరకు కసరత్తు అనంతరం తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏక్షణమైనా రద్దు చేయడంతోపాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ -1లో 258, మల్టీజోన్ -2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.
టాపర్లు వీరే..
గ్రూప్-1 ప్రధాన పరీక్షలో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ -2 కేటగిరిలో హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్ కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాపర్ గా నిలిచారు. ఉస్మానియా వైద్య విద్య పూర్తిచేసిన ఆమె.. గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపించారు. నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారు. ఆ తరువాతి స్థానాల్లో వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, సిదాల కృతిక, హర్షవర్ధన్, కె. అనూష, ఏరెండ్ల నిఖిత, కె.భవ్య, శ్రీకృష్ణసాయిలు ఉన్నారు.
కేసు వివరాలు..
టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1లో 563 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుల చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ప్రధాన పరీక్షలు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. అర్హత పరీక్ష ఇంగ్లీష్‌తోపాటు ప్రధాన పరీక్షలైన ఆరు పేపర్లు మార్కులను వెల్లడించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం విచారణ అనంతరం జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని, లేదంటే మరోసారి పరీక్ష నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. బుధవారం విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది.