Telangana Education: జస్ట్ పాసైతే చాలు.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!

జస్ట్ పాసైతే చాలు.. విద్యార్థులందరూ ప్రవేశ కోర్సులకు అర్హులేనని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు విద్యాశాఖ..

Telangana Education: జస్ట్ పాసైతే చాలు.. విద్యాశాఖ కీలక ఉత్తర్వులు!

Telangana Education

Updated On : August 23, 2021 / 7:58 AM IST

Telangana Education: జస్ట్ పాసైతే చాలు.. విద్యార్థులందరూ ప్రవేశ కోర్సులకు అర్హులేనని తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నేపథ్యంలో ఆయా కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు విద్యాశాఖ అమలు చేస్తున్న కనీస మార్కుల నిబంధనను తొలగించింది. దీంతో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, ఐదేండ్ల లా, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో పాసైన విద్యార్థులందరూ ప్రవేశాలు పొందేందుకు మార్గం సుగమమైంది.

గత విద్యాసంవత్సరంలో కూడా కనీస మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. కాగా, అదే నిబంధనను ప్రస్తుత విద్యాసంవత్సరంలోనూ అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి గతేడాది ఎంసెట్‌, లా ప్రవేశ పరీక్షలకు మాత్రమే కనీస మార్కుల నిబంధనను ప్రభుత్వం తొలగించగా.. ఈ ఏడాది ఆ కోర్సులలో నిబంధనను మాత్రమే తొలగించాలని అనుకుంది. కానీ ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులు తమకు ఆ విధానాన్ని వర్తింపజేయాలని హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఎంసెట్‌కు తొలగించిన కనీస మార్కుల నిబంధనను ఐసెట్‌కూ వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో ప్రస్తుత విద్యాసంవత్సరంలో అన్ని ప్రవేశ పరీక్షలకూ కనీస మార్కుల నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా ఇంటర్‌లో 35 శాతం కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ, లా, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హులవుతారు.