Kaleshwaram Water : కాళేశ్వరం నీళ్లపై తెలంగాణలో రాజకీయ రగడ.. మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం..
Kaleshwaram Water : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణలో రోజురోజుకు రాజకీయం వేడుకుతోంది. నిన్నటివరకు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్గా సాగిన ఈ వార్‌లోకి బీజేపీ కూడా చేరింది.
kaleshwaram project water politics revanth vs brs bjp
Kaleshwaram Water : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణలో రోజురోజుకు రాజకీయం వేడుకుతోంది. నిన్నటివరకు కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్గా సాగిన ఈ వార్‌లోకి బీజేపీ కూడా చేరింది. దీంతో మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కన్నేపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ కోరుతుండగా అదిసాధ్యం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మేడిగడ్డను ముట్టకుండానే నీళ్ళఎత్తొచ్చని విపక్షాలు సూచిస్తుంటే పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకని సర్కార్ ప్రశ్నిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకై ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగునీటి సమస్య తీవ్రంగా మారింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద ప్రాణహిత నది నుంచి లక్ష క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుందని, కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా వృథాగా పోతున్న నీటిని రైతులకు వినియోగించాలని కోరారు. ప్రభుత్వం చేయలేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణను మూడు నెలలు తమకు అప్పగిస్తే రైతులకు అవసరమైన నీటిని అందిస్తామని సవాల్ విసిరారు.
బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ఇదే డిమాండ్‌ను వినిపించారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వృథాగా పోతున్న నీటిని సాగుకు ఉపయోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లుమూసి నీటిని పంపింగ్ చేయడం సాంకేతికంగా ప్రమాదకరమని ఆయన చెప్పారు. అలా చేస్తే ప్రాజెక్టు భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు భద్రాచలం ప్రాంతం, పరిసర గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని వివరించారు.
ప్రభుత్వం జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA) నిపుణుల కమిటీ సూచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. నిపుణుల అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోమని చెప్పారు. అంతేకాకుండా, ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వంతో, ఎన్డీఎస్ఏ కమిటీతో మాట్లాడి వారి అనుమతి తీసుకురాగలిగితే, వారి సూచనల ప్రకారం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి ఈటల కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపు తిరుగుతుందో ఆసక్తిగా మారింది.
