Kamareddy SI Case : ఆ ఫోన్‌లో ఏముంది..? కామారెడ్డి జిల్లా ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్
కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి కేసులో వాట్సాప్ చాట్, సీసీ పుటేజ్ లు కీలకంగా మారాయి. ముగ్గురి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకొని డేటాను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

Kamareddy SI Case
SI Constable Death Case: కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ముగ్గురి అనుమానాస్పద మరణం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతిపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. పోలీసులు ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్టుమార్టం నివేదికలో వీరు ముగ్గురు చెరువులో మునగడంతోనే మరణించినట్లు నివేదికల్లో వెల్లడైంది. ముగ్గురు శరీరాలపై ఎలాంటి గాయాలు లేవు. నీటిలో మునగడంతో ఊపిరాడక వారు మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. ముగ్గురి సెల్ ఫోన్లు ఈనెల 25వ తేదీనే స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో భిక్కనూర్ పోలీస్ స్టేషన్ నుంచి వారు మరణించిన అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వరకూ దారి పొడవునా ఉన్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
Also Read: వీడిన మిస్టరీ.. పార్శిల్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..
ఎస్ఐ సాయికుమార్ ఈనెల 25న ఉదయం 11గంటల సమయంలో భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద కారులో వెళ్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో కారులో ఎస్ఐ ఒక్కడే ఉన్నాడు. ఆయన కామారెడ్డి వైపు వెళ్తున్నట్లు సీసీ పుటేజీల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ కామారెడ్డి చేరుకున్నారు. ఆ తరువాత ముగ్గురూకలిసి కారులో ఎటు వెళ్లారు.. ఏ సమయానికి చెరువు వద్దకు చేరుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది. అయితే, శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో ఆమెను కాపాడేందుకు ఎస్ఐ సాయికుమార్, ఆపరేటర్ నిఖిల్ చెరువులోకి దూకినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: Annamalai: చొక్కావిప్పి కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. వీడియో వైరల్
ఈ కేసులో వాట్సాప్ చాట్, సీసీ పుటేజ్ లు కీలకంగా మారాయి. ముగ్గురి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్ హిస్టరీ బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్ రెండు ఫోన్లు వినియోగిస్తున్నాడు. ఒకటి నీటిలో మునగడంతో ఆన్ కాకుండా పోగా.. మరో మొబైల్ స్క్రీన్ లాక్ ఉండటంతో ఓపెన్ కావడం లేదని తెలిసింది. ఫోన్ లాక్ కోసం సాయికుమార్ భార్యను పోలీసులు సంప్రదించగా తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. నిఖిల్ వాడుతున్న రెండు ఫోన్లలో ఒక ఫోన్ లో ఎలాంటి సమాచారం లేదని, మరొక ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కానిస్టేబుల్ శృతి ఫోన్ లాక్ ఓపెన్ కావడం లేదని సమాచారం. ఫోన్ డేటా బయటకు వస్తేనే ముగ్గురు డెత్ కేసులో మిస్టరీ వీడే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.