వీడిన మిస్టరీ.. పార్శిల్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..

తులసికి ఆస్తి దక్కకుడా కాజేసేందుకు శ్రీధర్ వర్మ, రేవతి పథకం పన్నారు. ఈ క్రమంలోనే తులసి ఇంటి నిర్మాణం సమయంలో క్షత్రియ ఫౌండేషన్ పేరిట ..

వీడిన మిస్టరీ.. పార్శిల్‌లో మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..

Dead Body Parcel

Updated On : December 27, 2024 / 4:56 PM IST

Body parcel case: పశ్చిమ గోదావరి జిల్లాలో క‌ల‌క‌లం సృష్టించిన మృత‌దేహం పార్శిల్‌ కేసుకు సంబంధించి మిస్టరీ వీడింది. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌, అత‌డి రెండో భార్య రేవ‌తి, ప్రియురాలు సుష్మ పాత్ర ఉన్న‌ట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ (SP Adnan Nayeem Asmi) వెల్లడించారు. పార్శిల్ లో మృత‌దేహం వ‌చ్చిన‌ట్లు సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు మొదలు పెట్టామని చెప్పారు. ముందుగా మృత‌దేహం ఎలా వ‌చ్చింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు మొద‌లు పెట్టామ‌ని వెల్ల‌డించారు.

ఎస్పీ తెలిపిన‌ వివరాల ప్రకారం.. రంగరాజుకు తులసి, రేవతి ఇద్ద‌రు కుమార్తెలు. వారిద్ద‌రి మ‌ధ్య ముందునుంచి వివాదాలు ఉన్నాయి. తుల‌సిని భ‌ర్త వ‌దిలేయ‌డంతో పుట్టింట్లోనే ఉంటుంది. రేవ‌తికి 2016లో శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌తో వివాహం జ‌రిగింది. అయితే, రేవ‌తితో కొంత‌కాలంగా శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ దూరంగా ఉంటున్నాడు. త‌న‌కు ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం అయిన సుష్మ‌తో క‌లిసి ఉంటున్నాడు. సుష్మ‌కు ఇదివ‌ర‌కే రెండు పెళ్లిళ్లు జ‌రిగాయి. తుల‌సి ఇంటిని నిర్మిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆర్థిక స‌హాయంకోసం సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న ఇచ్చుకుంది. రంగ‌రాజు ఆస్తిపై క‌న్నేసిన‌ శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ ఇదే అవ‌కాశంగా భావించి.. త‌న కుట్ర‌లో త‌ల‌సిని ఇరికేందుకు ప్ర‌య‌త్నించాడు. తుల‌సి ఇంటి నిర్మాణంకోసం క్ష‌త్రియ సేవా స‌మితి పేరిట స‌హ‌క‌రిస్తున్న‌ట్లు వ‌ర్మ‌, రేవ‌తి, సుష్మా డ్రామా ఆడారు. రెండుసార్లు పార్శిల్ ద్వారా ఇంటికి కావాల్సిన సామాన్లు పంపించారు. మొద‌టిసారి సెప్టెంబ‌ర్ నెల‌లో పెయింట్స్‌, రెండోసారి టైల్స్ పంపించారు. మూడోసారి పార్శిల్ బాక్సులో పర్లయ్య అనే వ్య‌క్తి మృతదేహాన్ని పంపించారు. పర్లయ్యాను భార్య వదిలేసింది. కుటుంబ సభ్యులు ఉన్నా పట్టించుకునే వారులేరు. అందుకే శ్రీధర్ వర్మ తాగుబోతు అయిన పర్లయ్యను తన పథకానికి వాడుకున్నాడు. ప‌ర్ల‌య్య‌కు మద్యం తాపించి హ‌త్య చేసి పార్శిల్ లో తులసి ఇంటికి పార్శిల్ చేశారు.

మూడోసారి వ‌చ్చిన‌ పార్శిల్ ను ఓపెన్ చేసే స‌మ‌యంలో రంగ‌రాజు, ఆయ‌న స‌తీమ‌ణి, శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌, తుల‌సి, రేవ‌తి ఉన్నారు. పార్శిల్ ను ఓపెన్ చేయ‌గా మృత‌దేహాన్ని చూసి అంతా కంగుతిన్నారు. డెడ్ బాడీ పార్శిల్ బాక్స్ లో కోటి 35ల‌క్ష‌లు ఇవ్వాల‌ని లేఖ పెట్టారు. దీంతో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం అక్క‌డే ఉన్న శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాడు. ఎవ‌రికీ తెలియ‌కుండా డెడ్ బాడీ స‌ముద్రంలో ప‌డేస్తాను.. డ‌బ్బు ఇవ్వాలంటూ తుల‌సిని, కుటుంబ స‌భ్యుల‌ను శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ న‌మ్మించాడు. అయితే, ఈ విష‌యాన్ని పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అక్క‌డి నుంచి వ‌ర్మ ప‌రార‌య్యాడు. ప్ర‌దానంగా ఈ కేసులో శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ‌, ఆయ‌న రెండో భార్య రేవ‌తి, సుష్మ‌లను అరెస్టు చేసిన‌ట్లు ఎస్పీ న‌యీం అస్మీ తెలిపారు.

Also Read : Kamareddy SI Case : కామారెడ్డి జిల్లా ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ కేసు.. బయటపడ్డ ఆ ముగ్గురి వాట్సాప్ హిస్టరీ..! అందులో ఏముందంటే..

మృతుడు పర్లయ్యకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ప‌ర్ల‌య్య కంటే ముందు వేరే వ్య‌క్తిని చంప‌డానికి ప్ర‌య‌త్నం చేశార‌ని, అయితే, ప‌ర్ల‌య్య అయితేనే ఎవ‌రికీ అనుమానం రాద‌ని భావించి ఆయ‌న్ను హ‌త్య‌చేసి పార్శిల్ చేశార‌ని ఎస్పీ తెలిపారు. అయితే, ఈ కేసును ఛేదించేందుకు 100 మంది పోలీసు సిబ్బంది దర్యాప్తులో పాల్గొన్నారని, శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ, రేవ‌తిలు దొరక్కుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ కుట్రకు పన్నాగం పన్నారని, పోలీసులనే విస్తుపరిచేలా ఈ ఘటన ఉందని ఎస్పీ పేర్కొన్నారు.