తెలంగాణలో మోగనున్న మరో ఎన్నికల నగారా.. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు

మారిన పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

తెలంగాణలో మోగనున్న మరో ఎన్నికల నగారా.. సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు

MLC Election

Updated On : October 28, 2024 / 9:13 PM IST

తెలంగాణలో మరో ఎన్నిక రానుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. గెలిచే అభ్యర్థులపై దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. అధికార కాంగ్రెస్‌ మాత్రం ఈ సీటుపై స్పెషల్ కాన్సంట్రేషన్ చేసింది.

గ‌తంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జ‌గిత్యాల నేత జీవ‌న్‌రెడ్డి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోయినా..గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో విజ‌య‌ం సాధించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. సిట్టింగ్ సీటును ఎట్టి ప‌రిస్థితిలో గెలుచుకోవాలని ఎత్తులు వేస్తోంది.

అధికారంలోకి వ‌చ్చాక ఉద్యోగ భర్తీల్లో స్పీడ్‌ పెంచామంటున్నారు కాంగ్రెస్ నేతలు. గ‌త ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేష‌న్ల విష‌యంలో కోర్టు కేసుల‌ను క్లియ‌ర్ చేసి.. నియామ‌కాలు చేస్తున్నామని చెప్తున్నారు. డీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చి కేవ‌లం 60 రోజుల్లోనే నియామ‌కాల‌ను చేసి రికార్డు సృష్టించింది. దాదాపు 11 వేల పైచిలుకు టీచర్‌ పోస్టులను భ‌ర్తీ చేసింది. ఇలా స‌ర్కారు ఏర్పడిన ప‌ది నెల‌ల్లోనే 40వేల‌కు పైగా ఉద్యోగ నియమాకాలు చేపట్టామంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.

ఎన్నిక‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ 
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్‌-1 ప‌రీక్షలను కూడా పూర్తి చేశామంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు గెలిచి తీరుతామని చెప్తున్నారు. ఈ ఎన్నిక‌ను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల‌కు చెందిన ముఖ్యనేత‌లు..మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌తో పాటు డీసీసీ అధ్యక్షులు.. పార్టీ అనుబంధ విభాగాల‌ను అప్రమ‌త్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్‌లు జూమ్ మీటింగ్‌లో నేత‌ల‌ను అల‌ర్ట్ చేశారు. పట్టభద్రుల ఓటరు న‌మోదుపై సీరియ‌స్‌గా ఎఫ‌ర్ట్ పెట్టాలని సూచించారు.

క‌రీంన‌గ‌ర్‌-నిజామాబాద్‌-మెద‌క్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయబోనని సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. జీవ‌న్ రెడ్డి బ‌రిలో నుంచి త‌ప్పుకోవ‌డంతో ఎవ‌రిని బరిలోకి దింపాలనే దానిపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఆల్ఫోస్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు బరిలో నిలిచిన వెలిచాల రాజేందర్ రావు టికెట్‌ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

త్రిముఖ పోటీ
ఇద్దరు నేతలు రాజకీయాల పట్ల ఆసక్తి ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎన్నికలు జరుగుతుండటంతో ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. అధికార పార్టీ ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించింది. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చాయి. బీజేపీ రాష్ట్రంలో 8 సీట్లు గెలిస్తే..ఈ జిల్లాల నుంచే ఏడుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం..బీజేపీ పైచేయి సాధించింది. కరీంనగర్, మెదక్, నిజమాబాద్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను కమలం పార్టీ గెల్చుకోగా, పెద్దపల్లి స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది.

మారిన పరిస్థితిల్లో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కాంగ్రెస్ సానుభూతి పరులను ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలో ఇప్పటి నుంచే బలమైన నేత కోసం అన్వేషణ మొదలు పెట్టారు. ఇక బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయింది. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గట్టి పట్టు ఉండేది. మరోసారి సత్తా చాటేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

బీజేపీకి ఈ ఎమ్మెల్సీ సీటు పరిధిలో గట్టి పట్టుంది. అసెంబ్లీతో పాటు, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాను చాటింది. బీజేపీలో కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్‌కి కూడా ఈ ఎన్నికలు సవాల్‌గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే సిట్టింగ్‌ ఈటు కోసం ప్రతిపక్ష పార్టీల కంటే ముందే దూకుడు మీదుంది.

ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?