Telangana Politics: బీసీలపై ప్రేమ ఉంటే ముదిరాజ్ అల్లుడు, కోడళ్లు ఎందుకు దొరకలేదు? ఈటలపై కౌశిక్ రెడ్డి ప్రశ్నలు
బీసీల మీద ఈటల ప్రేమ అనేది అబద్ధం. ఆయనకు బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కొడళ్లు ముదిరాజ్‌లలో దొరకలేదా?2004 కంటే ముందు సరైన ఇల్లు కూడా లేదు....ఈ రోజు ఐదేకరాల్లో గడి ఎలా వచ్చిందో చెప్పాలి. ఈటల వాహనాల విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

Eatala vs Kaushik Reddy: తనను రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటల చేసేవి హత్యా రాజకీయాలని ఆయన మండిపడ్డారు. ఈటల రాజేందర్ హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయానికే మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘హుజురాబాద్ మున్సిపాలిటీలో తీర్మానం మేరకే స్థూపం తొలగించారు. బీసీల మీద ఈటల ప్రేమ అనేది అబద్ధం. ఆయనకు బీసీలపై ప్రేమ ఉంటే అల్లుడు, కొడళ్లు ముదిరాజ్‌లలో దొరకలేదా?2004 కంటే ముందు సరైన ఇల్లు కూడా లేదు….ఈ రోజు ఐదేకరాల్లో గడి ఎలా వచ్చిందో చెప్పాలి. ఈటల వాహనాల విలువ 15 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈటల రాజేందర్ ఒక చీటర్ రాజేందర్‌గా మారిపోయారు. దళిత, ఎస్టీ భూములను గుంజుకున్న వాళ్ళను ఏమంటారు? బీసీలను చిన్న కులాలని ఎట్లా అంటారు? అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చీటర్ రాజేందర్ చెప్పాలి. ఈటల ను రాజకీయంగా కూల్చేది నేనే’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు.
అంతకు ముందు మీడియాలో ఈటల జమున మాట్లాడుతూ ఈటల హత్యకు రూ.20కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు తనకు తెలిసిందని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చలరేగిపోతున్నారని విమర్శించారు. ‘‘హుజురాబాద్ లో ఓ పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి వదిలి పెట్టారు. తన తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారని కౌశిక్ రెడ్డి చెప్పుకుంటాడు. ఆయన తల్లిదండ్రుల వద్ద ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డి బాగానే ఉండేవాడు కావచ్చు. కానీ, ప్రగతి భవన్లో చేరి పిచ్చి కుక్కలా వ్యవహరిస్తున్నాడు’’ అని జమున అన్నారు.