ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై పరోక్షంగా నిప్పులు చెరుగుతూ..
"నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో అడిగితే, కొందరు నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు" అని చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో చిట్‌చాట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మహానాడు వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కవిత మండిపడ్డారు. “తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోలేదని ఆయన చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు చాలాసార్లు మన ప్రాజెక్టులకు అడ్డు పడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా అదనంగా 200 టీఎంసీలను తరలించే కుట్ర జరుగుతోంది” అని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి తరఫున బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. “ఇది ప్రజల జీవనాధారం కాబట్టి అందరం కలసి దీని కోసం పోరాడాలి” అని అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై మండిపాటు
“పార్టీలో నాకు నీతులు చెప్పే నాయకులు ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాల్సిన వారు అలాంటి విషయాల్లో నిస్సహాయంగా ఉన్నారు. కేసీఆర్‌కు నోటీసులు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఏమి కార్యాచరణ చేపట్టింది? అని ప్రశ్నించారు.
“నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో అడిగితే, కొందరు నా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. పేడ్ ఆర్టిస్టులతో నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. నేను తప్పు ఏమీ చేయలేదు. నా నాన్నకు కూడా నేనే లేఖ రాస్తాను. వందల లేఖలు రాశాను కేసీఆర్‌కు. వాటిలో తప్పు ఏముంది?” అని కవిత వ్యాఖ్యానించారు.
“లిక్కర్ కేసు వచ్చినప్పుడు నేనే స్వయంగా కేసీఆర్‌కు రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ ఆయనే ‘ఇది నీ మీద కుట్ర. నీ మీదే కేసు పెడతారు’ అన్నారు. అందుకే రాజీనామా చేయలేదు” అని ఆమె వెల్లడించారు. “లీక్ వీరులపై చూపిస్తున్న ప్రతాపాన్ని రేవంత్ రెడ్డి మీద చూపించలేరా? ఆయనే కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. నేను తప్పుడు పనులు చెయ్యలేదు.
కేటీఆర్ గురించి పరోక్షంగా ఏమన్నారు?
“ట్విట్టర్‌లో పోస్టులు పెడితే పార్టీ నడవదు” అంటూ కవిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. “నాపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నా పార్టీలో ఎవరు స్పందించలేదు. నాకు చాలా బాధ కలిగించింది. అమెరికాలో ఏమి సంబరాలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన ఇటువంటి పరిస్థితుల్లో అమెరికాలో సంబరాలు అవసరమా?” అని నిలదీశారు.