Kavitha : నాపై కుట్రలు మొదలైంది అప్పటి నుంచే.. ఇవాళ నేను.. రేపు కేటీఆర్.. ఆ తరువాత కేసీఆర్.. హరీశ్ రావుపై కవిత సంచలన కామెంట్స్..
Kavitha : హరీశ్‌రావు, సంతోష్ రావులపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు జరుగుతున్నాయని అన్నారు.

Kavitha Sensational comments on Harish Rao and Santosh Rao
Kavitha Sensational comments on Harish Rao and Santosh Rao : బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత తొలిసారి బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సంతోష్‌రావులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు కవిత ఓ విజ్ఞప్తి చేశారు. నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి తెలుసుకోండి అంటూ కోరారు.
కేసీఆర్, కేటీఆర్, నేను.. మాది ఒక కుటుంబం. మాది రక్త సంబంధం. పదవులు పోతేనో.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తేనో పోయేటువంటి బంధం మాదికాదు. కానీ, కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా వాళ్లకు అధికారం వస్తుందని వారి ఆలోచన. దానిలో భాగంగానే మొదటి స్టెప్ పడింది. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. నన్ను ఇవాళ బయటకు పంపించారు. రేపటి నాడు ఇదే ప్రమాదం కేటీఆర్‌కు పొంచిఉంది. ఆ తరువాత కేసీఆర్‌ను బయటకు పంపిస్తారు. బీఆర్ఎస్ పార్టీని వాళ్ల హస్తగతం చేసుకునేందుకు ఇలా కుట్ర చేస్తున్నారని కవిత అన్నారు.
నా తండ్రి కేసీఆర్ చిటికెన వేలు పట్టుకుని ఓనమాల నేర్చుకున్నా. ఆయన స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ అని మాట్లాడా. స్వతంత్ర భారతదేశంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేశారని కవిత అన్నారు. బౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా..? బంగారు తెలంగాణ అంటే హరీశ్ రావు, సంతోస్ ఇళ్లలో బంగారం ఉంటే అవుతుందా..? అంటూ కవిత ప్రశ్నించారు.
నాపై అప్పటి నుంచే కుట్రలు..
ఎప్పుడైతే హరీశ్ రావు, రేవంత్ రెడ్డి ఒకే విమానంలో ప్రయాణం చేశారో అప్పటి నుంచే మా కుటుంబంపై కుట్రలు మొదలయ్యాయని కవిత అన్నారు. హరీశ్ రావు రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని సరెండర్ అయ్యాక మా కుటుంబాన్ని విడగొట్టాలని ప్లాన్ షురూ అయిందంటూ కవిత ఆరోపించారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి, హరీశ్ రావులు చెప్పాలి.. ఒకే విమానంలో మీరిద్దరూ కలిసి వచ్చారా.. రాలేదా..? అంటూ కవిత ప్రశ్నించారు.
హరీశ్ రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ. లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి అంటారు. కానీ, హరీశ్ రావు గురించి మాట్లాడరు. కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీశ్ రావు, సంతోష్ రావులేనని కవిత అన్నారు.
హరీశ్ రావు కేసీఆర్ తో మొదటి నుంచిలేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్ కు హరీశ్ రావు కట్టప్ప లాగా అంటారు. హరీశ్ రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు. నా ప్రాణం పోయినా కేసీఆర్ కు అన్యాయం జరగనివ్వను.. నాపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా..? అంటూ కవిత కంటతడి పెట్టారు.
వాళ్ల వల్ల కేటీఆర్‌కు చెడ్డపేరు వస్తుంది..
బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్స్ ను సృష్టించేది హరీశ్ రావే.. హరీశ్ రావు, సంతోష్ లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుందని కవిత అన్నారు. ఆడబిడ్డలు చెడు కోరుకోరు. ఎంత బాధ కలిగితే ఈ విధంగా మాట్లాడుతా. పార్టీని, కేసీఆర్ ఆరోగ్యాన్ని కాపాడండి రామన్న.. హరీశ్ రావు నక్కజిత్తులను గమనించండి అంటూ కేటీఆర్ కు కవిత సూచించారు.
దుబ్బాక ఉపఎన్నికల్లో ఓటమికి హరీశ్ రావే కారణం. నిజామాబాద్ లో నా ఓటమికి కుట్ర చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమికి కుట్రలే కారణమని కవిత అన్నారు.
సంతోష్ రావు వల్ల కేటీఆర్‌కు చెడ్డపేరు వస్తోందని కవిత అన్నారు. హరీశ్ రావు, సంతోస్ గ్యాంగ్ లు కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయి. నాపై కుట్రలు చేసిన వాళ్లు.. ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ కవిత అన్నారు.