రంగంలోకి కేసీ వేణుగోపాల్.. రాజీనామాపై వెనక్కి తగ్గిన జీవన్ రెడ్డి.. ఏం హామీ ఇచ్చారంటే?
జీవన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కుతగ్గి, పార్టీ బలోపేతంకోసం ..

MLC Jeevan Reddy
MLC Jeevan Reddy : అధికార కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు చిచ్చు రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అయినా వెనక్కు తగ్గని జీవన్ రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీంతో మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు మరోసారి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు.
Also Read : స్పీకర్ అయ్యన్న పాత్రుడుకి వైఎస్ జగన్ లేఖ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ..
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం జీవన్ రెడ్డి నివాసం వద్ద భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మా అందరికీ ఆయన మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడంకోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోలేని పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అని భట్టి అన్నారు. ఈ ప్రభుత్వం నడవడంకోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుందని భట్టి తెలిపారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి పార్టీ అధిష్టానం సిద్ధంగా లేదని, పార్టీలోఉన్న సీనియర్ నాయకులు మనస్థాపం చెందితే మేమందరం బాధపడతామని భట్టి అన్నారు.
Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా. చేరికల విషయంలో మనస్థాపం చెందాను. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు నాకు ఉందని అన్నారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్లనే నేను రాజీనామా సమర్పించలేదని, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ ఇస్తానని చెప్పారు.
ఇదిలాఉంటే.. జీవన్ రెడ్డితో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడారని తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కుతగ్గి, పార్టీ బలోపేతంకోసం ఎప్పటిలాగే పనిచేయాలని సూచించినట్లు సమాచారం. దీనికితోడు మంత్రి పదవినిసైతం జీవన్ రెడ్డికి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, ఈ విషయంపై 10టీవీ ప్రతినిధి జీవన్ రెడ్డిని ప్రశ్నించగా.. కేసీ వేణుగోపాల్ తనతో మాట్లాడలేదని చెప్పడం గమనార్హం.