పార పట్టిన కలెక్టర్.. మాటలు కాదు.. చేసి చూపించాలంటూ క్లాస్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ టేకులపల్లి మండలంలో పర్యటించారు. అంగన్వాడి కేంద్రం, పాఠశాల, ఆశ్రమ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు.

పార పట్టిన కలెక్టర్.. మాటలు కాదు.. చేసి చూపించాలంటూ క్లాస్..

Collector Jitesh Patil

Bhadradri Kothagudem collector jitesh patil : నిత్యం అధికారులతో సమీక్షలు, జిల్లాలో పర్యటనలతో బిజీబిజీగా ఉండే కలెక్టర్ పార పట్టారు.. నేనూ వ్యవసాయదారుడి కుటుంబం నుంచే వచ్చా అంటూ.. పిచ్చి చెత్తను ఎలా తొలగించాలో పారపట్టి చూపించారు.. కేవలం మాటలే కాదు.. చేతుల్లోనూ చేసి చూపించాలంటూ నవ్విస్తూనే ఉపాధ్యాయులకు కూసింత క్లాస్ కూడా పీకారు.. ఇంతకీ ఇంత చలాకీగా ఉంది ఏ జిల్లా కలెక్టర్ అనుకుంటున్నారా.. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. టేకులపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్ అంగన్ కేంద్రం, పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేశారు.

Also Read : Sonu Sood : సోనూసూద్‌కు కుమారి ఆంటీ బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. న‌వ్వులే న‌వ్వులు..

టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు లోని అంగన్వాడి కేంద్రం, పాఠశాలను తనిఖీ చేసి, అంగన్వాడి కేంద్రంలో బాలింతలు తల్లులు గర్భిణీలతో కలెక్టర్ మాట్లాడారు. అనంతరం కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో తరగతి గదులు వంటగది, వాషింగ్ ఏరియా, స్టోర్ రూమ్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలతో ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. పార పట్టుకొని పిచ్చి మొక్కలను తొలగించేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో ప్రిన్సిపల్ గారు.. మీరు పారపట్టుకొని ఎన్నిరోజులు అయింది అంటూ ప్రశ్నిస్తూనే.. విద్యార్థులకు మాటలు చెప్పడం కాదు ఆచరణలో చేసి చూపించాలంటూ సూచించారు.

Also Read : ఇదికదా డ్యాన్స్ అంటే.. కోహ్లీ, రోహిత్ సహా టీమిండియా ప్లేయర్స్ డ్యాన్స్ వీడియో చూశారా.. వైరల్

కష్టం, శ్రమ అంటే ఎలా ఉంటుందో విద్యార్థులకు ప్రాక్టికల్ గా చేసి చూపించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ సూచించారు. అనంతరం అక్కడి నుంచి వెళుతూ దారిలో రోడ్డు పక్కన పొలం దున్నుతున్న రైతు వద్దకు వెళ్లిన కలెక్టర్.. సదరు రైతుతో మాట్లాడారు. పంట గురించి, దిగుబడి గురించి వివరాలు తెలుసుకున్నారు. పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నీటి నిల్వలు పెరుగుతాయని రైతుకి అవగాహన కల్పించారు. కలెక్టర్ ప్రజలతో కలుపుగోలుగా ఉండటాన్ని చూసిన స్థానిక ప్రజలు ఆయన తీరుపట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.