KTR : పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన కేటీఆర్.. భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు
ముత్తిరెడ్డి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదు. గతం గతః అన్నట్టు పని చేసుకోవాలి. KTR

Kalvakuntla taraka rama rao (Photo : Twitter)
KTR Key Advise To Leaders : నేటి రాజకీయాల్లో ఒక పదవిని, పొజిషన్‌ని వదులుకోవాలంటే అంత ఈజీ కాదన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లోని క్లబ్ హౌస్ లో జనగామ ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రావు, ఎమ్మెల్యే రాజయ్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ పార్టీ జెండా ఎత్తిన రోజు నుండి నేటివరకు ముందున్న ఉన్న వ్యక్తి ముత్తిరెడ్డి అని కేటీఆర్ చెప్పారు. పార్టీ ఎక్కడ పని చేయమని ఆదేశిస్తే అక్కడ ముత్తిరెడ్డి పని చేశారని మెచ్చుకున్నారు.
”ముత్తిరెడ్డి రాజకీయ జీవితంలో ఇది కామా మాత్రమే. ఫుల్ స్టాప్ కాదు. గతం గతః అన్నట్టు పని చేసుకోవాలి. రేపటి పంచాయతీ ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయాల్లో ఒక పదవిని, ఒక పొజిషన్ ని వదులుకోవాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా, ఒక పార్టీ సీనియర్ నాయకుడిగా ఉంటూ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కలిసి పని చేద్దామని, సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేద్దామని ముత్తిరెడ్డి హుందాతనాన్ని చాటుకున్నారు.
Also Read : టీడీపీ సీటులో కారు జోరు చూపించగలదా.. హస్తవాసి ఎలా ఉంది?
ఎక్కడ పల్లా, ముత్తిరెడ్డి విడిపోతారా? జనగామలో బీఆర్ఎస్ ను ఓడగొడదమా? అని కొన్ని నక్కలు, తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే చాలా పటిష్టంగా పనిచేయాలి. ఎన్నికల కోసం ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి” అని మంత్రి కేటీఆర్ అన్నారు.
జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈసారి కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ముత్తిరెడ్డి అలక వహించారు. ఇరువురు నేతలు పోటాపోటీగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ఇంతలో ముత్తిరెడ్డిరి రెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు కేసీఆర్. అయితే, టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ముత్తిరెడ్డి.. ఆ పదవిని చేపడతారో లేదో అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ పదవిని చేపట్టి టికెట్ వివాదానికి తెరదించారు ముత్తిరెడ్డి.
తాజాగా జనగామ ఎమ్మెల్యే టికెట్ పంచాయితీని పూర్తిగా కొలిక్కి తెచ్చారు మంత్రి కేటీఆర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య ఆయన సయోధ్య కుదిర్చారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మద్దతు ప్రకటించారు. నిన్నటి వరకు జనగామ టికెట్ నాదే అని చెప్పుకున్న ముత్తిరెడ్డి.. కేటీఆర్‌తో భేటీ తర్వాత పల్లాకు మద్దతిచ్చేందుకు అంగీకరించారు.
Also Read : పొత్తులపై కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా.. ఎందుకీ పరిస్థితి?
జనగామ టికెట్ విషయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులతో కేటీఆర్ ఇవాళ సమావేశమయ్యారు. ఈ క్రమంలో పల్లా, ముత్తిరెడ్డితో మాట్లాడి వారితో చేతులు కలిపించి సయోధ్య కుదిర్చారు. దీంతో జనగామ టికెట్ విషయమై బీఆర్ఎస్ లో నెలకొన్న వివాదం ముగిసినట్లు అయ్యింది. పల్లా రాజేశ్వర్ రెడ్డికే టిక్కెట్ కేటాయించామని, భారీ మెజార్టీతో పల్లాను గెలిపించాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సహా పార్టీ నేతలకు సూచించారు కేటీఆర్.