అందుకే “కాళేశ్వరం కమిషన్” నోటీసులు పంపారు.. త్వరలో తేలిపోతుంది: కేటీఆర్
మళ్లీ ఆ కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

KTR
కమిషన్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమని తేలిపోయిందని చెప్పారు.
నిన్న సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని తెలిపారు. ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని చెప్పారు.
దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ నోటీసులు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కమీషన్లు బయటపడుతున్నాయనే… ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు చేస్తోందని తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి.. వచ్చేనెల 12న తీర్పు
జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారని కేటీఆర్ అన్నారు. అయితే మళ్లీ ఆ కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్లను పిలిచి, 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల అసలు ఎజెండా అని ఆరోపించారు.