KTR : తెలంగాణలో ‘కులగణన’పై పార్లమెంట్‌నే తప్పుదోవ పట్టిస్తారా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ఆగ్రహం.. భారీ లేఖ
KTR : తెలంగాణలో అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తి అయినట్టుగా సాక్షాత్తు దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ గాంధీ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేయడమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

KTR Slams Rahul Gandhi Comments
KTR : తెలంగాణలో అసమగ్రంగా జరిగిన కులగణనపై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తారా? అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ప్రజల వివరాలను సేకరించకుండా కులగణన సర్వేను రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి చేసిందని రాహుల్ గాంధీ లోక్‌సభలో పేర్కొనడంపై కేటీఆర్ మండిపడ్డారు.
ఇది పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ వేదికగా రాహుల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయిందన్నారు. బీసీల జనాభాను తగ్గించి వెనకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తప్పుల తడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందనడం ముమ్మాటికీ మోసం చేయడమేనని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ కూడా గ్యారెంటీల గారడీలానే మారిపోయిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు యూటర్న్ తీసుకోవడంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకమని తేలిపోయిందన్నారు.
నమ్మంచి మోసం చేసినందుకు తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లోనే కాదు.. ఇక ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నమ్మదని కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు.
తెలంగాణలో అసమగ్రంగా జరిగిన సర్వే పూర్తి అయినట్టుగా సాక్షాత్తు దేశ అత్యున్నత చట్టసభలో రాహుల్ గాంధీ పేర్కొనడం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేయడమేనని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.