Kukatpally Constituency: కాంగ్రెస్‌కు కొరుకుడు పడని కూకట్‌పల్లి.. బీఆర్‌ఎస్ ఎవరికి చాన్స్ ఇస్తుందో?

మిని ఇండియాగా పేరొందిన కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌పై అన్ని ప్రధాన రాజకీయపార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. కూకట్‌పల్లిలో ఈసారి ఎన్నికల్లో కనిపించబోయే సీనేంటి?

Kukatpally Constituency: కాంగ్రెస్‌కు కొరుకుడు పడని కూకట్‌పల్లి.. బీఆర్‌ఎస్ ఎవరికి చాన్స్ ఇస్తుందో?

Kukatpally Assembly Constituency Ground Report

Kukatpally Assembly Constituency: హైదరాబాద్ సిటీలో హాట్ సీటు కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం.. దేశం నలుమూలల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎందరో ఇక్కడ ఉన్నారు. అంతేకాదు సీమాంధ్రుల ప్రభావమూ ఎక్కువే.. 2009లో ఏర్పడిన కూకట్‌పల్లి నియోజకవర్గంలో మూడు సార్లు ఎన్నికలు జరిగితే మూడు పార్టీలకు ఓటర్లు పట్టం కట్టారు.. తొలిసారి లోక్‌సత్తా (Lok Satta) నేత జయప్రకాశ్ నారాయణ (Jayaprakash Narayan) గెలిస్తే.. తర్వాత రెండు ఎన్నికల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం గెలిచారు. రెండు సార్లు రెండు పార్టీల నుంచి ఎన్నికైన మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao).. ఈ సారి బీఆర్ఎస్ (BRS Party) నుంచి మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టే రేసుగుర్రాలు (Resu Gurralu) ఎవరు? కూకట్‌పల్లిలో ఈసారి కనిపించబోయే సీనేంటి?..

Madhavaram Krishna Rao

Madhavaram Krishna Rao

హైదరాబాద్ నగరం (Hyderabad City)లో ప్రతిష్టాత్మక సీట్లలో కూకట్‌పల్లి అసెంబ్లీ సెగ్మంట్ ఒకటి.. ఐటీ కారిడార్ పక్కనే ఉన్న కూకట్‌పల్లి మినీ ఇండియా చెబుతుంటారు. సీమాంధ్రులు ఎక్కువగా నివసించే కూకట్‌పల్లిలో రాజకీయం కూడా భిన్నంగానే ఉంటుంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా లోక్‌సత్తా పార్టీ తరఫున జయప్రకాశ్ నారాయణ్ గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన జరిగినా.. టీడీపీని ఆదరించి విలక్షణ తీర్పునిచ్చారు కూకట్‌పల్లి ఓటర్లు. ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు లక్షల 26 వేల 346 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 2 లక్షల మంది స్థానికేతరులే కావడం ఇక్కడి ప్రత్యేకత. ప్రధానంగా సీమాంధ్ర ఓటర్లు ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 2014లో టీడీపీ తరఫున గెలిచినా.. తర్వాత కాలంలో గులాబీ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వరుసగా రెండోసారి విజయకేతనం ఎగురవేశారు.

MLC Naveen Rao

MLC Naveen Rao

కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి.. తన బలం చెక్కుచెదరలేదని చాటుకుంది. నగరంలో చాలా చోట్ల బీజేపీ గాలి వీచినా.. ఈ నియోజకవర్గంలో మాత్రం కమలానికి చాన్స్ ఇవ్వలేదు ఓట్లరు. సీమాంధ్రులు అధికంగా ఉండే నియోజకవర్గంపై బీఆర్ఎస్ గట్టి పట్టు సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం బీఆర్ఎస్ గూటికి చేరిన తర్వాత పార్టీ చాలా స్ట్రాంగ్‌గా మారింది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణారావు హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేశానని.. తాగునీటి సమస్య పరిష్కారమైందని చెబుతున్నారు ఎమ్మెల్యే.. అంతేకాదు ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఫ్లై ఓవర్లు నిర్మించినట్లు చెబుతున్నారు. ఈ సారి కచ్చితంగా గెలుస్తానని అంటున్నారు ఎమ్మెల్యే మాధవరం. గెలుపుపై మాధవరం ధీమాగా ఉన్నా.. ఎమ్మెల్సీ నవీన్‌రావు (MLC Naveen Rao) కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎవరికి చాన్స్ ఇస్తుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?

ఇక కాంగ్రెస్‌కు కూకట్‌పల్లి కొరుకుడు పడటంలేదని చెబుతున్నారు. 2009 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరగగా అసలు ఖాతా తెరవలేకపోయింది హస్తం పార్టీ. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాలో కూడా ఇక్కడ పార్టీ గట్టెక్కలేకపోయింది. 2018లో మహాకూటమితో పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి కేటాయించడంతో కాంగ్రెస్ పోటీకి దూరంగా ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు వ్యూహరచన చేస్తోంది కాంగ్రెస్. సత్యం శ్రీరంగం, గొట్టిముక్కల వెంగళరావులు పార్టీ తరపున ముందుండి పోరాడుతున్నారు.

Madhavaram Kantha Rao

Madhavaram Kantha Rao

పూర్తిగా అర్బన్ ప్రాంతమైన కూకట్‌పల్లిలో ఎక్కువగా విద్యాధికులు నివసిస్తున్నారు. నార్త్ ఇండియన్లు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండటంతో బీజేపీ కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్‌తో ఈ సారి విజయం సాధించాలని చూస్తోంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నిరాశ తప్పలేదు. కానీ, వచ్చే ఎన్నికల్లో సత్తా చాటతామని చెబుతున్నారు కమలం నేతలు. ఇక్కడి నుంచి మాధవరం కాంతారావు (Madhavaram Kantha Rao), వడ్డేపల్లి రాజేశ్వర్రావు, హరీశ్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికి టిక్కెట్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు.

Nandamuri Suhasini

Nandamuri Suhasini

ఇక కూకట్‌పల్లిపై టీడీపీ కూడా భారీ ఆశలే పెట్టుకుంది. 2018 ఎన్నికల్లో మహాకూటమి తరపున టిడిపి అభ్యర్థిగా ఎన్టీయార్ మనవరాలు, హరికృష్ణ కుమార్తె సుహాసిని (Nandamuri Suhasini) పోటీ చేశారు. ఈ సారి కూడా సుహాసిని పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉండటంతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూకట్‌పల్లిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Also Read: రాజాసింగ్ ఇలాఖాలో తడాఖా చూపేదెవరో.. గోషామహల్‌లో గులాబీ జెండా ఎగిరేనా?

మొత్తం మీద మిని ఇండియాగా పేరొందిన కూకట్ పల్లి అసెంబ్లీ సెగ్మెంట్‌పై అన్ని ప్రధాన రాజకీయపార్టీలు భారీగా ఆశలు పెట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు మూడుసార్లు మూడు పార్టీలకు అవకాశం ఇచ్చిన కూకట్‌పల్లి ఓటర్లు ఈ సారి ఎవరికి అవకాశం ఇస్తారా.. అనేది ఆసక్తికరంగా మారింది.