Red Sanders: ‘పుష్ప’ తరహాలో అరటి గెలల మాటున ఎర్ర చందనం తరలింపు

అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు

Red Sanders: ‘పుష్ప’ తరహాలో అరటి గెలల మాటున ఎర్ర చందనం తరలింపు

L B Nagar

Updated On : May 13, 2022 / 1:14 PM IST

Red Sanders: ఎర్ర చందనం అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడిక్కడే ముమ్మర తనిఖీలు చేసినా..అక్రమార్కులు చాకచక్యంగా ఎర్ర చందనాన్ని అడవి దాటిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అరటి పండ్ల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు, అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈఘటనలో షేక్ మహమ్మద్ రఫీ, ముల్లా బషీర్ అహమ్మద్ అనే ఇద్దరు నిందితులను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Read Others:Minister ktr: శాస్త్ర సాంకేతిక రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా ఈ ఎర్రచందనాన్ని ముఠా సభ్యులు తరలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుండి 31 ఎర్రచందనం దుంగలను, మూడు మోబైల్ ఫోన్లను, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న ఎర్రచందన విలువ రూ.60 లక్షలపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ సరిహద్దు వరకు సుమారు 150-200 కిలోమీటర్ల పరిధిలో నిందితులు ఎర్ర చందనాన్ని ఎలా తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Others:Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు