ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి- హరీశ్ రావు చురకలు

ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.

Harish Rao : తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీశ్ రావు. 6 నెలలు గడుస్తున్నా ఇస్తామన్న పెన్షన్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు పెన్షన్లు పెంచారని చెప్పారు. ఏపీలో సాధ్యమైనది తెలంగాణలో ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు. ఏపీని చూసి సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హరీశ్ సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

”ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు. అనేక మాటలు చెప్పారు. వారందరినీ రోడ్ల మీదకు తెచ్చారు. వాళ్లను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందారు. సంతోషం. మరి అధికారంలోకి వచ్చాక వాళ్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది.

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఏడాదికి 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఏమైంది? ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు.. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా.. జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు? 6 నెలల్లో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు” అని రేవంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు హరీశ్ రావు.

”ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. డిసెంబర్ 9న 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. ఏప్రిల్ నెల పెన్షన్లు ఇంకా పడలేదు. మే నెల పెన్షన్లు ఇంతవరకు పడలేదు. ఇవాళ జూన్ 17వ తేదీ. ఓట్లు పడ్డాక, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక, 2 నెలల పెన్షన్ ఆపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి గారు అక్కడ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు రూ.4వేలకు పెంచారు.

రూ.4వేలకు పెన్షన్ పెంచుతూ ఫైల్ పై సంతకం చేశారు. పెన్షన్లు పెంచుతామని అన్నారు. మొదటి సంతకం చేస్తానన్నారు. మాట ప్రకారం చేశారు. మరి మీ మొదటి సంతకం ఏమైంది? ఆంధ్రప్రదేశ్ ను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకోండి. 4వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి. పాత బకాయిలు కలిపి ఇవ్వండి” అని సీఎం రేవంత్ ని డిమాండ్ చేశారు హరీశ్ రావు.

Also Read : కేసీఆర్‌ను అష్టదిగ్బంధం చేసిన ఆ 8మంది నేతలెవరు? వారిని టచ్ చేసి కేసీఆర్ తప్పు చేశారా?- ప్రొ. నాగేశ్వర్ విశ్లేషణ

ట్రెండింగ్ వార్తలు