Telangana Polls: కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఖర్గే, రాహుల్

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది

Telangana Polls: కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఖర్గే, రాహుల్

తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, రైతుబంధు పంపిణీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ విషయమై ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలు తమ ఎక్స్ ఖాతా ద్వారా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగులతో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గు చేటు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా.. రైతుబంధు లబ్దిదారులకు నగదు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వ పెడచెవిన పెట్టిందని ఖర్గే విమర్శలు గుప్పించారు.

అశోక్ నగర్ లో నిరుద్యోగులను రాహుల్ గాంధీ తాజాగా కలుసుకున్నారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘దొరల కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల అంశంలో వ్యవహరించిన తీరు సిగ్గుచేటు. తెలంగాణలో మా ప్రభుత్వం రాగానే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం. పేపర్ లీకులతో విద్యార్థులు నష్టపోయారు. ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’ అని పోస్ట్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని, యువ వికాసం కింద ఐదు లక్షల భరోసా కల్పిస్తామని రాహుల్ అన్నారు.


ఇక కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ.. ‘‘సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను ఉల్లంఘించారు. కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం నిలిపివేసింది. అయితే లబ్దిదారులకు డబ్బులు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది’’ అని ఆయన పోస్ట్ చేశారు. మెదక్ ఎన్నికల ప్రచార ర్యాలీకి సంబంధిచిన ఫొటోలను ఖర్గే షేర్ చేశారు.