Telangana: వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోందని చెల్లిని చంపిన అన్న
అజ్మీర సింధు (21)ను చంపిన యువకుడిని పోలీసులు ఓ ప్రాంతంలో అరెస్టు చేసి వివరాలు తెలిపారు.

representative image
Telangana – Crime: చెల్లి వీడియోలు తీసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోందని ఆమెను చంపాడు అన్న. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district)లో చోటుచేసుకుంది. తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి బుధవారం వివరాలు తెలిపారు. ఇల్లందు మండలంలోని రాజీవ్‌నగర్ లో ఓ కుటుంబం నివసిస్తోంది.
ఆ కుటుంబంలోని అజ్మీర సింధు (21) అనే యువతి మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్ గా పనిచేస్తోంది. సోషల్ మీడియాలో తన వీడియోను పోస్ట్ చేస్తుండేది. సింధు ఇంట్లో ఉన్న సమయంలో ఆమెను అన్న హరిలాల్ మందలించాడు. సింధు ఎదురు తిరిగింది.
సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల వీడియోలు ఉంటే పరువుపోతుందని హరిలాల్ చెప్పాడు. సింధు వినకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరిలాల్ రోకలి బండతో ఆమె తలపై కొట్టాడు. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే, సింధు పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఆరోగ్యంగా ఉండే సింధు ఎలా చనిపోయిందని గ్రామస్థులు అడిగారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హరిలాల్ పారిపోవడంతో అతడి కోసం గాలించి పట్టుకున్నారు.