లాక్ డౌన్ తో మోగని పెళ్లి బాజాలు : ఎంతో మంది పొట్ట కొట్టిన కరోనా

  • Published By: madhu ,Published On : April 15, 2020 / 01:15 PM IST
లాక్ డౌన్ తో మోగని పెళ్లి బాజాలు : ఎంతో మంది పొట్ట కొట్టిన కరోనా

Updated On : April 15, 2020 / 1:15 PM IST

పెళ్లంటే నూరేళ్ల పంట..ఓ ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే..మాములు సందడి ఉండదు. బంధు మిత్రులు, స్నేహితుల కలయికతో సందడి సందడిగా ఉంటుంది. వారి వారి స్థోమతను బట్టి పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. పెళ్లంటే కేవలం రెండు కుటుంబాల మధ్య జరిగే తంతు కాదు. వివాహం కొంతమందికి బతుకుదెరువు. ఎన్నో కుటుంబాలకు ఉపాధినిస్తోంది. ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరు, ఏప్రిల్ నెలలో ముహూర్తాలను బట్టి వివాహాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఫంక్షన్ హాల్స్ కిటకిటలాడుతుంటాయి. వివాహం జరిగే ఇళ్లు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతుంటుంది. పిండి వంటలు, ఇతర రకాల వంటలతో ఘుమఘుమలాడుతుంటాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ కనిపించడం లేదు. లాక్ డౌన్ తో ఎన్నో వివాహ ముహుర్తాలు అటకెక్కాయి. కళ్యాణ మంటపాలు బోసిపోతుండగా..ఫంక్షన్ హాల్స్ వెలవెలబోతున్నాయి. దీనిపై ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితి దయనీయంగా మారింది. 

కరోనా రాకాసి వల్ల భారతదేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఫలితంగా ఎన్నో వివాహాలు పోస్ట్ పోన్డ్ అయ్యాయి. మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు అంటే..సుమారు రెండు నెలల పాటు ఫుల్ బిజీగా ఉండవచ్చని భావించారు. ఈ సంవత్సరమైనా మంచి గిరాకీ వస్తుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లిళ్ల సందర్భంగా కొనుగోలు చేసే బట్టలు, బంగారు ఆభరణాలు, పర్నీచర్, స్టీల్ సామాగ్రీ, పత్రికల షాపులు, ప్రింటింగ్ ప్రెస్ తదితర వస్తువులు కొనుగోలు చేయకపోవడంతో దీనిపై ఆధారపడిన వ్యాపారులు తీరని నష్టాన్ని చవి చూస్తున్నారు. 

ఇక పురోహితుల సంగతి చెప్పనవసరం లేదు. కేవలం పెళ్లిళ్లు మాత్రమే జరిపించే పూజారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి కాలం కలిసి వస్తుందని అనుకున్న వీరి కోరికలు నెరవేరలేదు. కరోనా వైరస్ ఎప్పుడు పోతుందో..నని ఎదురు చూస్తున్నారు. బాజా భజంత్రీలు వాయించే కళాకారులు, బ్యాండ్ మేళాల్లో పని చేసే వారిలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ నెలకొంది. డెకరేషన్ చేసే వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 

ఇక క్యాటరింగ్ సంస్థలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఘుమఘుమలాడుతూ వంటలు చేస్తూ పేరు సంపాదించిన సంస్థల నుంచి..ఇతర క్యాటరింగ్ సంస్థలు చతికిలపడ్డాయి. ముందస్తుగా వేసుకున్న ప్లాన్స్ మొత్తం బెడిసికొట్టేలా చేసింది దిక్కుమాలిన కరోనా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. క్యాటరింగ్ సంస్థలో ఎంతో మంది పనిచేస్తుంటారనే సంగతి తెలిసిందే. కొంతమంది దీనిని పార్ట్ టైమ్ గా ఉపయోగించుకుంటుంటారు. వంటవాళ్ల నుంచి మొదలుకుని.. సిబ్బంది వరకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు. 

నగరంలో పెద్ద పెద్ద హోటళ్లలో, ఫంక్షన్ హాల్స్ లో భారీగా వివాహాలు జరుగుతుంటాయి. లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుండేది. పేరొందిన ఫంక్షన్ హాల్స్ లో నెల, రెండు నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉండేది. ప్రస్తుతం ఇవన్నీ కళ తప్పాయి. నగర శివారులో ఎక్కువగా ఉండే ఈ హాల్స్ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కో ఫంక్షన్ హాల్ లో రోజుకు రెండు..మూడు పెళ్లిళ్లు జరిపించేందుకు ఒప్పుకుంటుంటారు.

కరోనా కాటు వల్ల తమ ఆదాయానికి బ్రేక్ పడిందని వాపోతున్నారు ఫంక్షన్ హాల్స్ యజమానులు. దీనిపై ఆధారపడిన వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. కరోనా వైరస్ పూర్తిగా పోయిన తర్వాతే వివాహలు జరిపించాలని చాలా మంది అనుకుంటున్నారు. ఎలా చూసినా ఈ ఏడాది పెళ్లిళ్ల సందడి ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా కరోనా రాకాసి..ఓ వ్యవస్థనే ఘోరంగా దెబ్బతీసిదంటున్నారు.