Medaram Jathara: నేటి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు
దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు.

Medaram Hundi
Medaram Jathara: దక్షిణ భారత కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నుంచి హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో హుండీల లెక్కింపు జరగనుంది. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మొత్తం 493 హుండీలను..సీలు వేసిన అనంతరం హనుమకొండకు తరలించారు అధికారులు. హుండీలు ఉంచిన కల్యాణమండపం వద్ద గత కొన్ని రోజులుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక హుండీ లెక్కింపు కోసం దేవాదాయశాఖ నుంచి ఆదేశాలు అందడంతో బుధవారం నుంచి హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది.
Also read:Mallanna Sagar : మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో సగం తెలంగాణకు నీరు-హరీశ్ రావు
300 పైగా సిబ్బంది పలు విభాగాలుగా విడిపోయి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొంటారు. హుండీలను తెరిచేందుకు ఒక బృందం..వాటిలోని నోట్లు, వెండి, బంగారు వస్తువులను వేరుచేసేందుకు మరో బృందం పనిచేస్తుంది. కానుకల సమర్పణ సమయంలో బెల్లం, పసుపు- కుంకుమ అంటిన నోట్లను, వస్తువులను శుభ్రం చేసేందుకు ఒక బృందం పనిచేస్తుంది. లెక్కించేందుకు ఒక బృందం, లెక్కించిన నోట్లను కట్టలుగా కట్టేందుకు కూడా ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుంది. సమ్మక్క సారలమ్మ ఆలయ యంత్రాంగం సహా దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంటారు. హుండీ లెక్కింపుకు వచ్చే సిబ్బందికి ప్రత్యేక “డ్రెస్ కోడ్” కూడా ఉంటుంది.
Also read: Tirumala Sreevari Darshan: కాసేపట్లో.. శ్రీవారి దర్శన అదనపు కోటా టోకెన్ల విడుదల
దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు. సారలమ్మ దేవస్థానం సిబ్బంది, పలువురు స్వచ్చంద సేవకులతో కలిసి ఈ హుండీ లెక్కింపులో పాల్గొననున్నారు. మరోవైపు మేడారంలో జాతర అనంతరం నిర్వహించే “తిరుగువారం” పండుగకు నేడు ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతర అనంతరం వచ్చే బుధవారం నాడు ఈ “తిరుగువారం పండగ” నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా దేశం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు ఒక కోటి మందికి పైగా భక్తులు ఈ జాతరలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచింది ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.
Also Read: Gold and Silver Rates Today: రూ. 350 పెరిగిన బంగారం ధర
గత 2020 జాతర సందర్భంగా భక్తులు భారీగా బంగారం, వెండి వస్తువులను అమ్మవార్లకు కానుకలుగా సమర్పించారు. సుమారు రూ.11.64 కోట్లకు పైగా కానుకలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు వచ్చినందున ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు భావిస్తున్నారు. మేడారం జాతరలో భక్తులు కానుకలుగా సమర్పించగా వచ్చిన ఆదాయంలో మూడో వంతుకు పైగా ఆదాయం ప్రధాన పూజరుల కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దేవాదాయశాఖ చర్యలు తీసుకోనుంది.
Also read: Palindrome: ఆధ్మాత్మికంగా 22.02.2022 తేదీ ప్రత్యేకత