పాతబస్తీలో పాకిస్తాన్ వాసులు ఎవరున్నారో చెప్పాలి : బీజేపీకి ఎంపీ అసదుద్దీన్ సవాల్

Asududdin fires Bandi Sanjay’s comments : పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎంపీ అసుదుద్దీన్ ఫైర్ అయ్యారు. బీజేపీకి అసదుద్దీన్ సవాల్ విసిరారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ పదాలు లేకుండా ప్రచారం చేయగలరా..? అని ప్రశ్నించారు. చదువు, అభివృద్ధి గురించి చెప్పి ఎన్నికల్లో గెలవాలన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.
బీజేపీ నాయకులకు 24 గంటల సమయం ఇస్తున్నాం..పాతబస్తీలో పాకిస్తానీయులు ఎవరున్నారో చూపించాలన్నారు. దేశ ద్రోహులను పాతబస్తీలో మేమే ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. దేశంలో ఉన్నవాళ్లంతా ఇండియన్లే అన్నారు.
హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి సవాల్ విసిరారు. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ అనడం కాదు.. దమ్ముంటే చైనా సరహిద్దుల్లో సర్జికల్ స్ట్రైక్ చేయండి అన్నారు. 970 చ.కి.మీని ఆక్రమించిన చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు.
బీజేపీ అభ్యర్ధి మేయర్ అయిన తర్వాత పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం అంటూ బండి సంజయ్ కాంట్రవర్శియల్ కామెంట్లు చేశారు. రామాంతపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన సంజయ్.. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ ప్రచారంలో ఆవేశంగా స్పీచ్ ఇచ్చిన సంజయ్.. బీజేపీ అభ్యర్థి మేయర్ అయిన తర్వాత రోహింగ్యాలను ఏరివేస్తాం అని అన్నారు.
భాగ్యలక్ష్మీ ఆలయం పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. రోహింగ్యాలు లేని ఎన్నికలు జరగాలని అది బీజేపీ వల్లే సాధ్యం అవుతుందని అన్నారు. రోహింగ్యాల ఓటర్లు లేని ఎన్నికలు, పాకిస్తాన్ ఓటర్లు లేని ఎన్నికలు హైదరాబాద్‌లో జరగాలని అన్నారు. బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.