Jupally Krishna Rao: అవినీతి జరిగితే ముక్కు నేలకు రాస్తా.. బావ బామ్మర్ది ఇద్దరూ రావాలి.. గన్ పార్క్ వద్ద జూపల్లి సంచలన కామెంట్స్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్రంగా మండిపడ్డారు.
Minister Jupally Krishna Rao challenge to Harish Rao at Hyderabad Gun Park.
- ఆధారాలతో చర్చకు రండి
- అవినీతి ఆరోపణలు నిరూపించండి
- బావ బామ్మర్దులకు సవాల్
Jupally Krishna Rao: గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్రంగా మండిపడ్డారు. మొత్తం టెండర్ల విలువ రూ. 1143 కోట్లు అయితే, రూ. 2 వేల కోట్లు, రూ. 3 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని వారు ప్రశ్నించారు. ఈ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. తమపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి, పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.
బహిరంగ చర్చకు సిద్ధం.. ప్రెస్ క్లబ్ లేదా అసెంబ్లీకి రండి:
టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ. 455.23 కోట్లు, మిగిలిన వాటికి రూ. 687.77 కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆధారాలతో అసెంబ్లీకి లేదా ప్రెస్ క్లబ్‌కు రావాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవినీతిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రికి ముగ్గురం మంత్రులం కలిసి లేఖ రాస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో గురుకులాలను ప్రైవేట్ భవనాల్లో నడిపించారని, కానీ తాము గ్రీన్ ఛానెల్ ద్వారా బకాయిలు లేకుండా చెల్లిస్తున్నామని గుర్తుచేశారు.
అప్పులపై చర్చకు రండి.. బావ-బామ్మర్దులకు మంత్రి జూపల్లి సవాల్:
మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ. 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని తాము చెప్పిన వాస్తవాలపై చర్చకు రావాలన్నారు. తన సవాల్‌ను స్వీకరించి గన్‌పార్క్ వస్తానన్న హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ, బావ (హరీష్ రావు), బామ్మర్ది (కేటీఆర్) ఇద్దరూ కలిసి ఒకేసారి గన్‌పార్క్‌కు రావాలని సవాల్ విసిరారు. ఇద్దరికీ ఒకే వేదికపై ప్రజల ముందే వాస్తవాలతో సమాధానం చెబుతానన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంలో తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, కేసీఆర్ కూడా శాసనసభకు వచ్చి చర్చించాలంటూ మంత్రులు స్పష్టం చేశారు.
