Jupally Krishna Rao: బార్ యజమానులకు బిగ్ అలర్ట్.. ‘ప్రివిలేజ్ ఫీజు’పై జూపల్లి క్లారిటీ.. భారం మందుబాబులపైనే!
‘ప్రివిలేజ్ ఫీజు’ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Minister Jupally Krishna Rao stated that privilege fee would not impact bar owners.
Jupally Krishna Rao: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ‘ప్రివిలేజ్ ఫీజు’ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ బార్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలో ఆయన స్పందించారు. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, పొరుగు రాష్ట్రాల్లోని విజయవంతమైన ఎక్సైజ్ విధానాలకు అనుగుణంగానే ఇక్కడ కూడా బార్ లైసెన్సులను జారీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
బార్ యజమానులపై భారం శూన్యం.. మద్యం ధరల పెంపుతో తగ్గని విక్రయాలు:
ఈ కొత్త విధానం వల్ల బార్ యజమానులకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లదని మంత్రి స్పష్టమైన అభయం ఇచ్చారు. ప్రివిలేజ్ ఫీజు ప్రభావం కేవలం మద్యం కొనుగోలు చేసే వినియోగదారులపై మాత్రమే స్వల్పంగా పడుతుందని పేర్కొన్నారు. సాధారణంగా మద్యం ధరలు పెరిగినంత మాత్రాన వినియోగం తగ్గదనేది గత అనుభవాలు చెబుతున్న సత్యమని తెలిపారు. ధరల పెంపుదల వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెరుగుతుందే తప్ప, విక్రయాల పరిమాణం పెద్దగా తగ్గిన దాఖలాలు ఎక్కడా లేవని ఆయన పునరుద్ఘాటించారు.
మద్యం రాబడి గణాంకాలు.. చట్టబద్ధంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం:
రాష్ట్రంలో మద్యం ద్వారా లభిస్తున్న రాబడి గణాంకాలను మంత్రి జూపల్లి ఈ సందర్భంగా వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మద్యం రాబడి రూ.10,000 కోట్ల నుంచి దాదాపు 260 శాతం పెరిగి రూ.36,000 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆదాయం రూ.40,000 కోట్లకు చేరుకుందని వెల్లడించారు. ప్రభుత్వం పూర్తిగా చట్టాలు, నిబంధనలకు కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్రంలో మద్యం ఉత్పత్తికి నీటి కొరత వంటి ఎలాంటి సాంకేతిక అవరోధాలు లేవని తేల్చిచెప్పారు.
