Telangana Assembly 2023 : 24గంటలు కరెంట్ పచ్చి అబద్ధం.. స్కాముల్లో తిన్నదంతా కక్కిస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ చర్చ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య వాడీ వేడి వాదనలు జరిగాయి.

Telangana Assembly 2023..Komati Reddy Venkata Reddy : ఈరోజు అసెంబ్లీలో విద్యుత్ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విద్యుత్ రంగంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించింది. రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని..శ్వేతపత్రం ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కరెంట్ కోసం రైతులు, పారిశ్రామిక వేత్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని..ధర్నాలు చేశారని తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ పాలలో ఆ ఇబ్బందులు తీర్చామని అన్నారు.బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో ఆస్తులు పెరిగాయని అన్నారు. రైతులతో పాటు అన్ని రంగాలకు 24గంటలు కరెంట్ ఇచ్చామని తెలిపారు.
జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వటం అనేది పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. ఏ సీజన్ లోను 24గంటలు కరెంట్ ఇవ్వలేదని..ఇవ్వకుండానే ఇచ్చామని ప్రజల్ని మభ్యపెట్టారని మండిపడ్డారు. విద్యుత్ రంగంలో భారీ స్కామ్ జరిగిందని ఈ స్కాముల్లో తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. దామరచర్లలో భారీ స్కామ్ జరిగిందని..ఈ స్కామ్ లో తిన్నదంతా కక్కిస్తామని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుందని..అలా చెప్పి ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. కానీ అసలు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టింది దేశంలో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ అని..7 గంటల నుంచి 9 గంటలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గత పాలన గురించి గుర్తు చేశారు కోమటిరెడ్డి. కానీ బీఆర్ఎస్ మాత్రం తామే ఉచిత విద్యుత్ ఇచ్చామని అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని కానీ ఏ సీజన్ లోను కూడా రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వలేదని..బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది..అబద్దాలని నిరూపిస్తామని అన్నారు.