Minister KTR : ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నారు.. దేశం సిగ్గుపడే పరిస్థితులు తెచ్చారు- కేంద్రంపై కేటీఆర్ ఫైర్

ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.

Minister KTR : ఏం తినాలో, ఏం వినాలో డిక్టేట్ చేస్తున్నారు.. దేశం సిగ్గుపడే పరిస్థితులు తెచ్చారు- కేంద్రంపై కేటీఆర్ ఫైర్

Updated On : August 27, 2022 / 6:22 PM IST

Minister KTR : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, బీజేపీ విధానాలు, ఆ పార్టీ నేతలపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రజలు ఏం తినాలో, ఏం వినాలో బీజేపీ నేతలు డిక్టేట్ చేస్తున్నారని మండిపడ్డారు. దేశం సిగ్గుపడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారని కేంద్రంపై సీరియస్ అయ్యారు కేటీఆర్.

జీడీపీని గ్యాస్, డీజిల్, పెట్రోల్ గా అభివర్ణించిన కేటీఆర్.. జీడీపీ బాగా పెరిగిపోయిందని విమర్శించారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపైన చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీ పడాలని, మత ఘర్షణలు సృష్టించడంలో కాదని హితవు పలికారు కేటీఆర్.

స్టాండప్ కమెడియన్ ఫారూఖీ మునావర్ పైనా పంచాయితీ పెడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్రయత్నం అని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

తెలంగాణ‌లో ఇటీవ‌ల మతాల పేరుతో చోటుచేసుకున్న ప‌రిణామాల‌పైనా మంత్రి కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. మతం పేరుతో కొట్లాడుకోవాలని, తన్నుకు చావమని ఏ దేవుడు చెప్పాడని కేటీఆర్ నిలదీశారు. దేశంలో విపరీతంగా పెరిగిన ధరలపై చర్చించమంటే ముందుకురాని బీజేపీ నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం ఉవిళ్లూరుతున్నారని ఫైర్ అయ్యారు.

”మ‌తాల పేరు చెప్పుకుని కొట్టుకోమ‌ని ఏ దేవుడు చెప్పాడు? నీళ్లు లేక కొంద‌రు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే.. వాటి ప‌రిష్కారం వ‌దిలేసి అన‌వ‌స‌ర విష‌యాల‌పై రాద్ధాంతం చేయ‌డం అవ‌స‌ర‌మా?” అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

8 ఏళ్ల పాల‌న‌లో తెలంగాణ‌లో ఏం సాధించార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయ‌న్న కేటీఆర్… ఈ 8 ఏళ్ల స్వ‌ల్ప కాలంలోనే నీటిపారుద‌ల రంగంలో తెలంగాణ దేశానికే ఓ న‌మూనాగా మారింద‌ని చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రం ఉజ్వ‌ల స్థితికి చేరింద‌న్నారు. రాజ‌న్న సిరిసిల్ల జిల్లా జలసంరక్షణలో ఐఏఎస్‌ల‌కే పాఠాలు చెప్పే స్థాయికి ఎద‌గ‌టమే ఇందుకు నిద‌ర్శ‌న‌మన్నారు. కేసీఆర్ హ‌యాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించింద‌న్న‌ కేటీఆర్‌… దేశంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఉద్యోగ నియామ‌కాలు జ‌రిపిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల‌కెక్కింద‌న్నారు.