ఎక్కడున్నారు ? హైదరాబాద్ లో మిస్సింగ్ కేసుల కలకలం, 24 గంటల్లో 10 మంది అదృశ్యం

Missing cases in Hyderabad : హైదరాబాద్ నగరంలో మిస్సింగ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వీరంతా ఎక్కడున్నారో తెలియడం లేదు. 24 గంటల వ్యవధిలో ఏకంగా 10 మంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.
హయత్ నగర్ లో అక్క, తమ్ముడు, ఛత్రినాక పీఎస్ పరిధిలో తల్లి, కూతురు, పంజాగుట్టలో 19 ఏళ్ల యువతి, ఖైరతాబాద్ బాలికతో పాటు యువతి, కూకట్ పల్లిలో ఇద్దరు పిల్లలతో పాటు తల్లి కనిపించకుండా పోయారు. వీటిపై పోలీసులు దృష్టి సారించారు. మిస్సింగ్ కేసులపై దర్యాప్తు చేపడుతున్నారు.
తెలంగాణలో రోజు రోజుకు మిస్సింగ్ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 203 మంది ఆదృశ్యమయ్యారు. అక్టోబర్ 26న 65 మంది, అక్టోబర్ 27న 62 మంది, అక్టోబర్ 28వ తేదీన 65 మంది మిస్సింగ్ అయినట్లుగా తెలుస్తోంది. గత 8 నెలలుగా 1282 మిస్సింగ్ కేసులు నమోదు కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులకు ఈ మిస్సింగ్ కేసులు సవాల్ గా మారుతున్నాయి. కొన్ని కేసులు పరిష్కారమౌతున్నా..మరికొన్ని తేలకుండానే మిగిలిపోతున్నాయి. తమ వారు ఎక్కడ ఉన్నారో…ఎలా ఉన్నారో తెలియక కుటుంసభ్యులు ఆందోళన పడుతున్నారు.