Kadiyam Srihari : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు
Kadiyam Srihari : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం నోటీసులు జారీ చేశారు.
Speaker Gaddam Prasad, Kadiyam Srihari
Kadiyam Srihari : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న (బుధవారం) ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు.
కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్ కు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11గంటలకు జరగబోయే విచారణకు హాజరు కావాలని వివేకానందకు కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి, వివేకానంద వాదనలను స్పీకర్ ప్రసాద్ కుమార్ వివరనున్నారు.
ఇదిలాఉంటే.. పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా.. పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా.. ఇప్పటికే ఏడుగురికి స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తీర్పు ఇచ్చారు. అయితే, దానం నాగేందర్ పిటిషన్ విచారణ దశలో ఉంది. తాజాగా.. కడియం శ్రీహరి పిటిషన్ ను బుధవారం విచారించనున్నారు. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపు కడియం శ్రీహరిని విచారణ అనంతరం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
