బీజేపీలో చేరుతున్న వారిపై రాజాసింగ్ సంచలన కామెంట్స్.. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం పేర్లను ప్రస్తావిస్తూ..
"కొన్ని బాధలను భరించే శక్తిని కూడా మీలో పెంచుకోవాలి. మా అసెంబ్లీ పరిధిలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం నేను ఏమీ చేయలేకపోయాను" అని అన్నారు.

Raja Singh
బీజేపీలో చేరికలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీలో ఇతర పార్టీ నుంచి చాలామంది చేరుతారని ప్రచారం జరుగుతోందని తెలిపారు. బీజేపీలోకి చేరేవారికి సుస్వాగతమని అన్నారు. అయితే, బీజేపీ చేరే ముందు కొన్ని మాటలు యాది పెట్టుకోవాలని, అలాగే రాసి పెట్టుకోవాలని చెప్పారు.
“బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది మీ అసెంబ్లీలో, మీ జిల్లాలో, మీ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగదు. మీ పైన విశ్వాసం పెట్టుకుని మీ కార్యకర్తలు ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు ఆ కార్యకర్తలకి ఏ పదవి కూడా ఇప్పించలేరు. ఎన్నికల ముందు మీకే టికెట్ వస్తదన్న గ్యారెంటీ కూడా ఉండదు. బీజేపీలో చేరుతున్న వారు ఇప్పుడు ఫస్ట్ సీట్లో, ఆ తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారు. బీజేపీలో చేరిన తర్వాత కొన్ని అలవాట్లు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆశా వర్కర్లకు ప్రభుత్వం తీపి కబురు.. 3 కీలక నిర్ణయాలు
కొన్ని బాధలు కూడా భరించే శక్తిని కూడా మీలో పెంచుకోవాలి. మా అసెంబ్లీ పరిధిలో 11 సంవత్సరాలుగా వారి అణచివేతను ఎదుర్కొంటున్నాము. నన్ను మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన మా కార్యకర్తల కోసం నేను ఏమీ చేయలేకపోయాను. బీజేపీలో చేరేముందు కొంతమందితో మీరు చర్చలు చేసుకుని రండి. బీజేపీలో చేరిన తర్వాత ఏమవుతుందని అడగండి. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వారు చాలా మంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత పార్టీని విడిచి ఎందుకు వెళ్లిపోయారు?
వారితో ఒక్కసారి చర్చించండి. ఇది నా వ్యక్తిగత సూచన. హిందూత్వానికి, దేశానికి, సమాజానికి చాలా మంచి పనులు చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ తెలంగాణలో బీజేపీ కొందరి వల్ల సర్వనాశనం అవుతోంది. ఈరోజు కాకపోతే రేపు తెలంగాణలో రాక్షసులు నాశనమవుతారు. కార్యకర్తల ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీ తెలంగాణను పాలిస్తుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి బీజేపీ నుంచి వస్తారు” అని అన్నారు.