MLC Addanki Dayakar: కవితకు కాంగ్రెస్‌లో నో ఎంట్రీ, ఉనికి కోసమే వారిద్దరి కొట్లాట- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.

MLC Addanki Dayakar: కవితకు కాంగ్రెస్‌లో నో ఎంట్రీ, ఉనికి కోసమే వారిద్దరి కొట్లాట- ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

Updated On : July 16, 2025 / 7:31 PM IST

MLC Addanki Dayakar: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తాను ఏ పార్టీనో కవిత చెప్పాలని అన్నారు. మండలి సభ్యులు హుందాగా ఉండాలని హితవు పలికారు. బీసీ బిల్లు పెట్టింది మేమైతే.. మా వల్లనే వచ్చిందని ఇద్దరు ఎమ్మెల్సీలు(కవిత, తీన్మార్ మల్లన్న) కొట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఇక కవిత కాంగ్రెస్ లో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపైనా అద్దంకి దయాకర్ స్పందించారు. కవితకి కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ అని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ లోనే లీడర్లు ఎక్కువ అయ్యారని అన్నారు.

”పార్టీని బలోపేతం చేయడం కోసం పెద్ద పెద్ద లీడర్లం కార్యకర్తలయ్యాం. తెలంగాణలో బీఆర్ఎస్ కు స్థానం లేదు. ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు. బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాంగ్రెస్ పోరాడుతుంది. బీసీ బిల్లు అసెంబ్లీ ప్రోరోగ్ అయ్యింది. బీజేపీ వాళ్ళు చేయరు, పట్టించుకోరు. కేంద్రం ముందు బిల్లు ఉంటే ఎందుకు పరిష్కరించలేకపోతోంది? మోదీ నిజమైన బీసీనా? డూప్లికేట్ బీసీనా? బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏమీ తీసుకురారు. పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చుంటున్నారు. హిందూ పేటెంట్ బీజేపీకి ఎవరిచ్చారు?

జగన్ కు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇచ్చింది కేసీఆర్. లక్ష కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. కేటీఆర్ చేస్తున్న పొలిటికల్ డ్రామాలు బీజేపీకి అనుకూలంగా మారాయి” అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు.

కవిత, తీన్మార్ మల్లన వివాదంపైనా అద్దంకి దయాకర్ స్పందించారు. ”మండలి సభ్యులు హుందాగా ఉండాలి. వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడొద్దు. కాంగ్రెస్ తెచ్చిన బిల్లులు మేము తెచ్చినట్లుగా వారు ప్రచారం చేసుకోవడం విడ్డూరం. కవిత, మల్లన్న సంయమనంతో ఉండాలి. కవిత ఏ పార్టీనో తెలియడం లేదు. మల్లన్న కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ.

ఉనికి కోసమే వారిద్దరు రాద్ధాంతం చేస్తున్నారు. మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే. ఈ రెండూ కూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేవి కావు. అయినా ఆ సమస్య మీది కాదు. మా పార్టీ, మా ముఖ్యమంత్రిది, మా ఎమ్మెల్యేలది. మేమంతా కొట్లాడి త్వరగా తెచ్చిన బిల్లుపై మీరెందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అలాంటి కల్చర్ ను తెలంగాణలో తీసుకురావొద్దని ఇద్దరు మిత్రులకు సూచిస్తున్నా” అని అద్దంకి దయాకర్ అన్నారు.