Kavitha: కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ.. “మై డియర్ డాడీ” అంటూనే..
బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు.

TRS MLC kavita
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయని ఇటీవల ప్రచారం జరిగింది. అది నిజమేనని తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ప్రస్తుతం కవిత అమెరికాలో ఉన్నారు. “మై డియర్ డాడీ” అంటూ కేసీఆర్‌కు కవిత ఆరు పేజీల లేఖ రాయడం గమనార్హం.
పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు అంశాలను కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడటం అందరికి నచ్చిందని చెప్పారు. ఆయన ప్రసంగంలో కాంగ్రెస్ ఫెయిల్.. అంటూ చెప్పిన తీరు బాగుందని తెలిపారు. పహల్గాం మృతులకు నివాళి మౌనం పాటించడం పాజిటివ్ అంశమని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని పేరు పెట్టి విమర్శించకపోవడం చాలా మందికి నచ్చిందని తెలిపారు. కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి తిడుతున్నప్పటికీ.. కేసీఆర్ హుందాగా వ్యవహరించారని అన్నారు. పోలీసులకు కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుందని అన్నారు.
ఇక కవిత నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవటం సరికాదని అన్నారు. వక్ఫ్ బిల్లు, బీసీలకు 42 శాతం అంశం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం బాలేదని చెప్పారు.
అంత పెద్ద సభకు మళ్లీ పాత ఇన్‌చార్జీలకు బాధ్యతలను ఇవ్వటంతో వారు పాత విధానంలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న అభిప్రాయాలు కొన్ని నియోజకవర్గాల్లో వచ్చాయని తెలిపారు. బీజేపీపై రెండే నిమిషాలు మాట్లాడటం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. బీజేపీ వల్ల తాను బాధపడ్డానని, ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉంటే బాగుండేదని తెలిపారు.