Farmers: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు

తెలంగాణ రైతుల ఖాతాల్లో రేపటి నుంచి రైతుబంధు నిధులు జమకానున్నాయి.

Farmers: రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు

Farmers (1)

Updated On : December 27, 2021 / 10:44 AM IST

Farmers: తెలంగాణ రైతుల ఖాతాల్లో రేపటి నుంచి రైతుబంధు నిధులు జమకానున్నాయి. రైతుల అకౌంట్లో నగదు జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు ఎకరం పొలం ఉన్నవారికి డబ్బులు జమకానున్నాయి. ఆ తర్వాత రోజురోజుకు ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. వచ్చే నెల రెండో వారంలోపు రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తికానుంది.

గత సీజన్‌తో పోలిస్తే ఈసారి రైతుబంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్య, నగదు మొత్తం కూడా పెరగనుంది. ఈ వానాకాలం సీజన్‌లో 61లక్షల 8వేల మందికి 7వేల 377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించింది ప్రభుత్వం. వచ్చే యాసంగి సీజన్​కోసం లబ్ధిదారుల సంఖ్య 66లక్షల 56 వేలకు పెరిగింది. దీంతో వారికి 7వేల 600 కోట్ల పైగా సాయం అందనుంది.

సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో రూ.300కోట్ల మేర అదనంగా రైతుబంధు సాయం అందించనుంది ప్రభుత్వం. అటు రైతుబంధు చెల్లింపుల కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థికశాఖ సమకూర్చుకుంటోంది. ఖజానాకు వచ్చే ఆదాయంతో పాటు రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తాన్ని ఇందుకు వినియోగించనుంది.

డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 3వేల 500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం… మరో 2వేల కోట్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. రేపు ఈ బాండ్ల విక్రయంతో రెండు వేల కోట్ల మొత్తం సమకూరనుంది.