Telangana : రేవంత్ సర్కార్ బిగ్ ప్లాన్.. వచ్చేనెల నుంచి రేషన్‌తోపాటు ఫ్రీగా బ్యాగులు.. ఎందుకంటే?

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు చేపట్టింది.

Telangana : రేవంత్ సర్కార్ బిగ్ ప్లాన్.. వచ్చేనెల నుంచి రేషన్‌తోపాటు ఫ్రీగా బ్యాగులు.. ఎందుకంటే?

Telangana govt

Updated On : August 18, 2025 / 8:21 AM IST

Telangana: తెలంగాణ రాష్ట్రం (Telangana Govt) లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన ప్రతిఒక్కరికీ రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇటీవల అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసింది. వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ చేయనున్నారు. అయితే, రేషన్‌తోపాటు ఫ్రీగా బ్యాగులు కూడా ఇచ్చేందుకు సర్కార్ నిర్ణయించింది.

Also Read: Telangana : వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి వాళ్లకు 15శాతం రిజర్వేషన్.. అందుకు అర్హతలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలలకు సంబంధించి రేషన్ కోటా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) జులై, ఆగస్టు నెలల్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది. వారికి రెండు నెలలుగా రేషన్ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు అందుకున్న వారికి కూడా ప్రభుత్వం రేషన్ ఇవ్వనుంది.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి యథావిధిగా ప్రజాపంపిణీ కేంద్రాల (రేషన్ దుకాణాలు) ద్వారా సన్నబియ్యంను సరఫరా చేయనున్నారు. దీంతో కొత్తగా రేషన్ కార్డు అందుకున్నవారు నేరుగా రేషన్ దుకాణాలకు వెళ్లి రేషన్‌ను తీసుకోవచ్చునని అధికారులు చెప్పారు.

రేషన్ తీసుకునే ప్రతిఒక్కరికీ ఫ్రీగా బ్యాగులు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు బ్యాగులు చేరినట్లు సివిల్ సప్లయ్స్ అధికారులు తెలిపారు. బ్యాగు ధర బయట రూ.50 వరకు ఉంటుందని చెప్పారు.

ఈ బ్యాగుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ ఫొటోలతో పాటు ఇందిరమ్మ అభయహస్తం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల వివరాలు ప్రింట్ అయి ఉంటాయి.

రేషన్ అయిపోయాక అవే బ్యాగులను ఇతర సరులు, కూరగాయలు, కిరాణా సామాన్లు తెచ్చుకునేందుకు వాడుకోవటానికి వీలుగా క్వాలిటీగా బ్యాగులను తయారు చేయించినట్లు తెలిసింది. ఈ ఫ్రీ బ్యాగుల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారంకు వీలుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట.