Rains: బాబోయ్.. మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

Rains
Rains: తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు (Rains) పడుతున్నాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రానున్న 24గంటల్లో కోస్తాంధ్రా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖపట్టణం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 0891 2590102, 0891 2590100 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
ఇవాళ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వర్షం సమయంలో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. వర్ష ప్రభావం, నష్టం నివారణా చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖా మంత్రి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వర్షం పడింది.
దీంతో నగరంలోని రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అదిలాబాద్, హనుమకొండ, కామారెడ్డి, ఖమ్మం, కొమరం బీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.