Crows Fall : ‘విరూపాక్ష’ సీన్ రిపీట్.. ఆ ఊళ్లో ఏం జరుగుతోంది..? గాల్లో ఎగురుతూ టప్ మని కిందపడి కాకులు మృతి..!
Crows Fall : అసలు కాకులకు ఏమైంది? ఎందుకిలా ఆకాశం నుంచి ఒక్కసారిగా కిందపడి మృత్యువాత పడుతున్నాయి. ఆ ఊళ్లో ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Image Source : Google (Represent Image)
Crows Fall from Sky : నిజంగా ఆ ఊళ్లో ఏం జరుగుతోంది. కాకులకు ఏమైంది. ఎందుకిలా ఒక్కసారిగా కిందపడి చనిపోతున్నాయి. స్థానికుల్లో ఇదే అంతుచిక్కని ప్రశ్న వినిపిస్తోంది. గతంలో వచ్చిన ‘విరూపాక్ష’ మూవీలో కూడా కాకులు ఉన్నట్టుండి గాల్లో ఎగురుతూ హఠాత్తుగా కిందపడి చనిపోవడం చూసే ఉంటాం..
అయితే, ఆ ఊరికి ఏదో కీడు జరగబోతుందని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్థులు భయాందోళన చెందుతుంటారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒక ఊళ్లో జరుగుతోంది.
ఆ ఊళ్లో కాకులు ఆకాశంలో ఎగురుతూనే కిందపడి విలవిల్లాడుతూ మృతిచెందుతున్నాయి. అసలేం జరుగుతుందో ఆ గ్రామస్థులకు అంతుపట్టడం లేదు. అక్కడి స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలోని మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాయపల్లిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
శనివారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆ ఊళ్లో వేర్వేరు చోట్ల సుమారుగా 10 కాకులు చెట్లపై నుంచి కిందపడి మృత్యువాత పడ్డాయి. అసలు ఎందుకు ఇలా కాకులు చనిపోతున్నాయో తెలియడం లేదని అక్కడి గ్రామస్థులు వాపోతున్నారు.
కాకుల మృతికి సంబంధించి ఆ జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్యను సంప్రదించగా.. అసలు కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు. అందులోనూ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల తీవ్రత కారణంగానే కాకులు చనిపోతున్నాయా? లేదా ఇంకా ఏదైనా కారణం ఉందా? అనేది గుర్తించేందుకు సిబ్బందిని ఆ ఊరికి పంపిస్తామని తెలిపారు.
వాస్తవానికి ఎండల తీవ్రత తట్టుకోలేక కూడా కాకులు మృతిచెందే అవకాశం ఉంది. భగ్గుమని మండిపోతున్న ఎండల్లో సరైన ఆహారం దొరక్క కూడా కాకులు చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు.