Raghunandan Rao: దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయండి.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం. రఘునందన్ రావు(Raghunandan Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు.
Mp raghunandan rao sensational comments on cm revanth reddy
- అసెంబ్లీ రద్దుకు రఘునందన్ సవాల్
- ఎంపీల రాజీనామాలకు బీజేపీ సిద్ధం
- రైతు సమస్యలపై ప్రభుత్వ విమర్శలు
Raghunandan Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం. రఘునందన్ రావు (Raghunandan Rao)తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలనను సమర్థంగా నిర్వహించడంలో సీఎం విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. అలాగే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి గురించి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్‌లో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాజకీయ విమర్శలకే పరిమితమైందని అన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సూచించారు. అసెంబ్లీ రద్దు చేస్తే తెలంగాణలో గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, కేవలం అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతు తమకే ఉందని బీజేపీ నమ్మకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రఘునందన్ రావు ప్రస్తావించారు. కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండిపోవడం, బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నుంచి తగిన స్పందన కనిపించడం లేదని విమర్శించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ నడుస్తోందని వ్యాఖ్యానించారు. మాటలకే పరిమితం కాకుండా తన సవాల్‌ను స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డిని రఘునందన్ రావు కోరారు.
