నన్ను అవమానించారు..: ఎమ్మెల్యే సీతక్క

నన్ను అవమానించారు..: ఎమ్మెల్యే సీతక్క

Updated On : December 28, 2020 / 10:21 AM IST

Mulugu MLA Seethakka:తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్ కాంగ్రెస్ పీసీసీ ఎంపిక విషయమే. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ సీనియర్లు బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేస్తుండగా.. కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ఇదే అంశంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపికలో తన అభిప్రాయం తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పటికే సీనియర్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా.. అదే బాటలో పీసీసీ ఎంపిక విధానంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పీసీసీ ఎంపికలో తన అభిప్రాయం తీసులేదని, కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలో సభ్యురాలినే అయినా.. తన అభిప్రాయం తీసుకోకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు నమ్మకం కలిగించే వారినే ఎన్నుకోవాలని, తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.

ఎమ్మెల్యేల మీటింగ్‌కు పిలిచి నన్ను వేరు చేసి చూశారని, తన అభిప్రాయం చెప్పాకైనా దూరం పెట్టాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం సాధ్యంకాదని, కానీ.. కార్యకర్తలకు నమ్మకం కలిగించే వారినే పీసీసీ చీఫ్ చేయాలన్నారు. తాను కోరుకున్న వారికి టీపీసీసీ పదవి రాకున్నా పార్టీలో ఉంటానన్నారు. పీసీసీ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే సీతక్క అభిప్రాయపడ్డారు.