తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల చిచ్చు.. ఏం జరిగిదంటే?
ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలది ఫెఫికాల్ బంధం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ, బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది.
- కొన్నిచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన కమలనాథులు
- ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ తీరుపై చర్చ
- కరీంనగర్ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు వెనుక బండి?
- క్రమశిక్షణ లోపమా? పరిస్థితులకు తగ్గట్లు నడుచుకున్నారా?
Telangana: మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు..తెలంగాణ బీజేపీలో చిచ్చును రాజేశాయి. చిత్ర విచిత్రమైన ఈక్వేషన్స్ హాట్ టాపిక్‌గా మారడంతో పార్టీ అధిష్టానం పెద్దలు ఆరా తీసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ ఇచ్చిన ఆదేశాలేంటి.? ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరేంటి.? కాంగ్రెస్, బీఆర్ఎస్తో పొత్తులకు కారణమేంటన్న దానిపై డిటేయిల్డ్ రిపోర్ట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పటాన్చెరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎంపీ ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా నిలబడిన నీలం మధు సతీమణి మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఉండటంతో..తాను బీఆర్ఎస్కు మద్దతు తెలిపానని రఘునందన్ ఆ తర్వాత ప్రకటించారు. ఇక సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్‌కు, పైగా మైనార్టీ క్యాండిడేట్‌కు ఓటు వేయడం కూడా హాట్ టాపిక్ అయింది. అయితే తన రాజకీయ ప్రత్యర్థి కోనేరు కోనప్ప వర్గానికి ఛైర్మన్ పీఠం దక్కొద్దనే హస్తం పార్టీకి సపోర్ట్ చేశానని పాల్వాయి హరీశ్ బాబు చెప్పుకొస్తున్నారు.
వీళ్లిద్దరి సంగతి ఇలా ఉంటే..కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకుంది. మెజార్టీ సీట్లు వచ్చినా మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడంతో..ఇండిపెండెంట్ల మద్దతు తీసుకున్నారు. ఎట్టకేలకు కరీంనగర్ మేయర్ సీటును బీజేపీ ఖాతాలో పడేలా శ్రమించారు బండిసంజయ్. అందరూ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర పన్నితే..తాను సింగిల్‌గా ఫైట్ చేసి మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేశానని బండిసంజయ్ చెబుతున్నారు.
Also Read: ఇప్పటినుంచే విశాఖ మేయర్ పీఠంపై కూటమి పార్టీల గురి.. ఏం జరుగుతోంది?
అయితే విపక్ష పార్టీలతో ములాఖత్ అయి బండిసంజయ్ మేయర్ కుర్చీని సొంతం చేసుకున్నారని గుసగుసలు పెట్టుకుంటున్నారని కమలనాథులు. మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ గైర్హాజరు వెనుక సంజయ్ ములాఖత్ రాజకీయం అందరికీ అర్థమైపోయిందని ఇంటర్నల్ డిస్కషన్స్‌లో మాట్లాడుకుంటున్నారట బీజేపీ లీడర్లు. ఇక చాలా చోట్ల బీజేపీ కౌన్సిలర్లు..కాంగ్రెస్, బీఆర్ఎస్కు మద్దతు తెలిపారు. అంతేకాదు చాలాచోట్ల బీజేపీ నేతలు ప్రత్యర్థి పార్టీలతో కలిసి వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఒకరి మీద మరొకరు పైచేయి సాధించే క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో తాము సత్తా చాటామని..పలానా నేత కనీసం ఒక్క కౌన్సిలర్‌ను కూడా గెలిపించుకోలేకపోయారని చెవులు కొరుక్కుంటున్నారట.
క్రాస్ ఓటింగ్ ఎందుకు జరిగింది..?
రాష్ట్ర పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వొద్దనీ స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది..? కొన్ని చోట్ల గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు ఎందుకు తరలించారు..? అధికార, ప్రతిపక్ష పార్టీలతో ములాఖత్ అయ్యిందెవరు.? అనే దానిపై పార్టీ జాతీయ పెద్దలు సీరియస్‌గా రియాక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడంతో..అసలు విషయం ఏంటన్నదానిపై ఆరా తీసిన రాష్ట్ర పార్టీ పెద్దలు..ఢిల్లీకి డిటేయిల్డ్ రిపోర్ట్ పంపారట.
ఇదే నిజమైతే జరిగితే బీఆర్ఎస్కు ఓటేసిన రఘునందన్ రావు, కాంగ్రెస్‌కు ఓటేసిన పాల్వాయి హరీశ్‌బాబుపై అధిష్టానం యాక్షన్ ఎలా ఉండబోతుంది.? మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో కలిసి వైస్ ఛైర్మన్ పదవులు దక్కించుకోవాలని డిసైడ్ చేసిందెవరు.? అన్నది తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో తాము ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వకపోతే గెలిచిన బిజేపీ కౌన్సిలర్లు పార్టీ మారేవారంటూ కొత్త లాజిక్ తెస్తున్నారట మరికొందరు బీజేపీ నేతలు.
ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలది ఫెఫికాల్ బంధం అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ ప్రచారాన్ని నిజం చేసేలా బీజేపీ, బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. కొన్ని చోట్ల ఏకంగా జాతీయ స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న కాంగ్రెస్‌కు జై కొట్టారు కమలనాథులు. ఇవేం ఈక్వేషన్స్, పార్టీ లైన్‌కు పూర్తిగా విరుద్ధంగా ఎలా పనిచేస్తారని జాతీయ పార్టీ పెద్దలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర బీజేపీని సెట్ రైట్ చేయడానికి ఢిల్లీ పెద్దలు ఏ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తారో చూడాలి మరి.
